జేడీయూ జాతీయాధ్యక్షుడిగా ఆ పార్టీ ఎంపీ లలన్‌ సింగ్‌ నియమితులయ్యారు. ముంగేర్‌ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది

బిహార్‌లో అధికార జనతాదళ్ -యునైటెడ్ (జేడీయూ) అధ్యక్షుడిగా లలన్‌ సింగ్‌ నియమితులయ్యారు. గతంలో అధ్యక్షుడిగా వ్యవహరించిన రాజీవ్‌ రంజన్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆయన స్థానంలో లలన్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ రంజన్‌ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ఇటీవల జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా వైదొలిగారు. కాగా, లలన్‌ సింగ్‌... ముంగేర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. మరోవైపు, కొత్త అధ్యక్షుడిగా లలన్‌ సింగ్‌ నియమితులు కావడంతో ఢిల్లీలోని ఆ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు.