కలహాల కాపురానికి వందరోజులు..ఏటీకి ఎదురీదుతున్న కుమారస్వామి

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 30, Aug 2018, 12:44 PM IST
kumaraswamy government 100 completes days
Highlights

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి అధికార పగ్గాలు చేపట్టి ఇవాళ్టీకి 100 రోజులు పూర్తయ్యింది. నాటకీయ పరిణామాలు, ఉత్కంఠల నడుమ కుమారస్వామి నాయకత్వంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి అధికార పగ్గాలు చేపట్టి ఇవాళ్టీకి 100 రోజులు పూర్తయ్యింది. నాటకీయ పరిణామాలు, ఉత్కంఠల నడుమ కుమారస్వామి నాయకత్వంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. 12 ఏళ్ల తర్వాత కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి పలు పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ బ్యాంకుల్లో ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశారు.

రాజధాని బెంగళూరుతో పాటు మరికొన్ని చోట్ల ఇష్టారాజ్యంగా నెలకొల్పిన పరిశ్రమలపై చర్యలు తీసుకున్నారు. దుబారా ఖర్చులు తగ్గించాలని, మంత్రులు, ఉన్నతాధికారులు కొత్తగా వాహనాలను కొనుగోలు చేయరాదని.. విలాసాలకు పెట్టే ఖర్చును తగ్గించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ వంద రోజుల ప్రయాణంలో కుమారస్వామి అనేక ఎత్తుపల్లాలను చూశారు.

కాంగ్రెస్ సీనియర్ మంత్రుల నుంచి సహాయ నిరాకరణ, సొంత పార్టీలో లుకలుకలు, కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం లభించకపోవడం ఆయన్ను  ఇబ్బంది పెట్టాయి. ఒకదశలో కార్యకర్తల సమావేశంలో కుమారస్వామి కంటతడి పెట్టారు. మరోవైపు తమ ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్నారంటూ ఉత్తర కర్ణాటక వాసులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై దృష్టిసారించిన కుమారస్వామి ఉద్యమకారులను శాంతింపజేయడానికి రెండో రాజధాని ప్రతిపాదనను తీసుకొచ్చారు.

బెలగావీని రాష్ట్రానికి రెండో రాజధానిగా చేస్తామని ప్రకటించారు.. 2006లో బెలగావీని రెండో రాజధానిగా ప్రతిపాదిస్తూ... నాటి జేడీఎస్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. ఉత్తర కర్ణాటకలోని 13 జిల్లాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు పొటేత్తాయి.. ఈ సమయంలో కుమారస్వామి ప్రభుత్వం సరిగా స్పందించలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. ఏరియల్ సర్వేలో భాగంగా కుమారస్వామి విమానంలో పేపర్ చదవటం, మంత్రి రేవన్న వరద బాధితులపై బిస్కట్ ప్యాకెట్లు విసరడం పెద్ద దుమారాన్ని రేపాయి. వీటన్నింటి నడుమ కుమారస్వామి ప్రభుత్వం వందరోజులు పూర్తి చేసుకుంది.

loader