పాకిస్తాన్‌కు మద్దతిచ్చేందుకే మ్యాచ్ చూసేందుకు వెళ్లారా?: సిద్దు, డీకేలకు కుమారస్వామి ప్రశ్న..
కర్ణాటకలోని అధికార కాంగ్రెస్‌పై జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి విమర్శలు గుప్పించారు.
కర్ణాటకలోని అధికార కాంగ్రెస్‌పై జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి విమర్శలు గుప్పించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్, పలువురు మంత్రులు శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ని వీక్షించడంపై కుమారస్వామి స్పందించారు. పాకిస్తాన్‌కు చీర్స్ చెప్పేందుకు కాంగ్రెస్ కేబినెట్ బృందం స్టేడియానికి వెళ్లిందా? అని ప్రశ్నించారు. జేడీఎస్ కార్యాలయంలో ఈరోజు ఉదయం విజయదశమి వేడుకలను నిర్వహించారు.
అనంతరం కుమారస్వామి మీడియాతోమాట్లాడుతూ.. కర్ణాటక అనేక సమస్యలను ఎదుర్కొంటుందని అన్నారు. కరెంట్ లేక రైతులు అల్లాడుతున్నారని చెప్పారు. అయితే సంక్షోభ పరిస్థితులను పట్టించుకోకుండా.. కాంగ్రెస్ కేబినెట్ మొత్తం వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లిందని అన్నారు. అయితే తాను మ్యాచ్ చూసేందుకు వెళ్లడాన్ని తప్పుబట్టడం లేదని చెప్పారు. వారు వెళ్లింది భారత్ ఆడుగున్న మ్యాచ్ అయితే దానికి కొంత అర్థం ఉండేదని అన్నారు.
అయితే వారు వెళ్లింది ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కోసమని.. రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం సమయం కేటాయించడం మానేసి ఆ మ్యాచ్ కోసం సమయం వెచ్చించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వారు తమకు దేశభక్తి పాఠాలు నేర్పుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటే.. వారికి అపాయింట్‌మెంట్ లభిస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు వెళ్లి అపాయింట్‌మెంట్ కోసం ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదా? అని కుమారస్వామి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవసరానికి తగ్గ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో విఫలమైందని మండిపడ్డారు.
బెంగళూరులో శుక్రవారం ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు వెళ్లారు.