మణిపూర్ ప్రభుత్వానికి కుకీ పీపుల్స్ అలయెన్స్ పార్టీ షాక్ ఇచ్చింది. బీరెన్ సింగ్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఆదివారం వెల్లడించింది. ఈ మేరకు గవర్నర్ అనుసూయ యూకీకి లేఖ రాసింది.
న్యూఢిల్లీ: సుమారు మూడు నెలల పాటు హింసాత్మక అల్లర్లతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడికింది. 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అతి దారుణమైన ఘటనలు బయటకు వచ్చాయి. హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం.. మొత్తం జాతినే ఊచకోత కోసే రీతిలో ప్రయత్నాలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అక్కడ మైతీలు, కుకీలకు మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇందులో కుకీలు అఘాయిత్యాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వానికి కుకీ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. ఆదివారం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
కుకీ పీపుల్స్ అలయెన్స్ పార్టీ ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించింది. మణిపూర్‌లోని ఎన్ బీరెన్ సింగ్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంరించుకున్నట్టు వివరిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ అనుసూయ యూకీకి లేఖ రాసింది.
రాష్ట్రంలోని ప్రస్తుత హింసాత్మక మంటలను చూసి తాము ఒక నిర్ణయానికి వచ్చినట్టు కేపీఏ ఆ లేఖలో తెలిపింది. ప్రస్తుత బీరెన్ సింగ్ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగినా ప్రయోజనం లేదనే విషయం తమకు అర్థమైందని వివరించింది. అందుకే మణిపూర్ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరిస్తున్నట్టు తెలిపింది. బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతు లేదని స్పష్టం చేసింది.
Also Read: నేను శివుడిని, నిన్ను చంపి బతికిస్తా..: మద్యం మత్తులో వృద్దురాలిన హత్య చేసిన వ్యక్తి
మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఇందులో కేపీఏకు ఇద్దరు ఎమ్మెల్యేలు. ఒక్క బీజేపీకే 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఐదుగురు ఎన్‌పీఎఫ్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు బీరెన్ సింగ్‌కు ఉన్నది. అదే విపక్షాల బలం చూస్తే ఎన్‌పీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు ఉన్నారు.
