మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు కేపీపీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్. సిద్ధూకు ఎన్నోసార్లు అండగా నిలిచానని.. పార్టీ కోసం త్యాగాలు చేశానని శివకుమార్ పేర్కొన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ (113) దాటి ఏకంగా 135 స్థానాలను కైవసం చేసుకుంది. 1989 తర్వాత ఈ స్థాయి విజయాన్ని కాంగ్రెస్ నమోదు చేసింది. అంతా బాగానే వుంది కానీ.. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరని ఆ రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎంను ఎన్నుకోవడానికి ఆదివారం సాయంత్రం సీఎల్పీ సమావేశం జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లలో ఒకరిని సీఎంగా ఎంపిక చేయనున్నారు.
ఈ నేఫథ్యంలో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం నేపథ్యంలో శివకుమార్ ఆదివారం తుమకూరు జిల్లాలోని నోనవినకెరెకు వెళ్లారు. అక్కడ కడసిద్ధేశ్వర మఠానికి చేరుని ప్రత్యేక పూజలు చేశారు . అలాగే గంగాధరేశ్వర అజ్జయ్య, వృషభ దేశికేంద్ర మఠాధిపతి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అనంతరం డీకే మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధరామయ్యతో తనకు విభేదాలు వున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
ఆయనతో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని.. ఎన్నోసార్లు సిద్ధూకు అండగా నిలిచానని, పార్టీ కోసం ఎంతో త్యాగం చేశానని డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఈ మఠం తనకు పవిత్రమైన స్థలమని.. తనపై ఈడీ, ఐటీ దాడులు జరిగినప్పుడు అజ్జయ్య స్వామిజీ భరోసానిచ్చారని ఆయన తెలిపారు. తాజా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 134 సీట్లు కావాలని తాను స్వామిజీని కోరానని.. కానీ అంతేకంటే ఎక్కువే వచ్చాయని డీకే శివకుమార్ వెల్లడించారు.
Also Read: సీఎం ఎవరు.. కర్ణాటక పరిశీలకుడిగా సుశీల్ కుమార్ షిండే, హుటాహుటిన ఢిల్లీకి మల్లిఖార్జున ఖర్గే
ఇదిలావుండగా.. కర్ణాటక రాష్ట్రానికి ఏఐసీసీ పరిశీలకులను నియమించింది హైకమాండ్ . మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్‌లను ఈ మేరకు నియమించింది. నేటి సీఎల్పీ సమావేశానికి పరిశీలకులు హాజరై.. అక్కడ తీసుకున్న నిర్ణయాలు, చర్చల సారాంశంపై హైకమాండ్‌కు నివేదిక అందించనున్నారు. మరోవైపు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి ఆయన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో చర్చించనున్నారు.
మరోవైపు.. మాజీ సీఎం సిద్ధరామయ్య.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కావడం కన్నడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయేనని.. ఇందులో రాజకీయాలు చర్చించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశంలోనే సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
ఇక, ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో.. కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 66 సీట్లు, జేడీ(ఎస్) 19 సీట్లు గెలుచుకున్నాయి. స్వతంత్రులు 2 చోట్ల, కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ ఒక స్థానంలో, సర్వోదయ కర్ణాటక పక్ష ఒక స్థానంలో విజయం సాధించాయి.
