ఆదివారం కర్ణాటకలో సీఎల్పీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇక్కడ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రానికి ఏఐసీసీ పరిశీలకులను నియమించింది హైకమాండ్
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా తీవ్ర నిరాశలో వున్న ఆ పార్టీ శ్రేణులకు కర్ణాటకలో విజయం ఊరట కలిగించింది. భారీ విజయం సంగతి పక్కనబెడితే.. ఇప్పుడు అక్కడ కాబోయే సీఎం ఎవరన్నది ఉత్కంఠగా మారింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లు సీఎం రేసులో నిలిచారు. దీంతో వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎల్పీ సమావేశం జరగనుంది.
ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రానికి ఏఐసీసీ పరిశీలకులను నియమించింది హైకమాండ్ . మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్‌లను ఈ మేరకు నియమించింది. నేటి సీఎల్పీ సమావేశానికి పరిశీలకులు హాజరై.. అక్కడ తీసుకున్న నిర్ణయాలు, చర్చల సారాంశంపై హైకమాండ్‌కు నివేదిక అందించనున్నారు. మరోవైపు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి ఆయన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో చర్చించనున్నారు.
మరోవైపు.. మాజీ సీఎం సిద్ధరామయ్య.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కావడం కన్నడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయేనని.. ఇందులో రాజకీయాలు చర్చించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశంలోనే సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
ఇక, ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో.. కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 66 సీట్లు, జేడీ(ఎస్) 19 సీట్లు గెలుచుకున్నాయి. స్వతంత్రులు 2 చోట్ల, కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ ఒక స్థానంలో, సర్వోదయ కర్ణాటక పక్ష ఒక స్థానంలో విజయం సాధించాయి.
