Asianet News TeluguAsianet News Telugu

వివాదాస్పదంగా మారిన ‘చేపల కూర’ వ్యాఖ్యలు.. బాలీవుడ్ నటుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు..

బెంగాలీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని బిజెపి నాయకుడు,బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌పై కోల్‌కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీపీఎం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం గతంలో బెంగాలీ వ్యతిరేక వ్యాఖ్యలపై పరేష్ రావల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రావల్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని సలీం ఆరోపించారు.  

Kolkata cops register FIR against Paresh Rawal after row over remark on Bengalis
Author
First Published Dec 6, 2022, 12:34 PM IST

వివాదాస్పదంగా మారిన‘చేపల కూర’వ్యాఖ్యలు: బెంగాలీలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీజేపీ నాయకుడు, ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌పై కోల్‌కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరేష్ రావల్‌ "బెంగాలీ వ్యతిరేక" వ్యాఖ్యలు చేశారని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సీపీఐ(ఎం) కార్యదర్శి ఎండీ సలీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రావల్ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని,ఆ వ్యాఖ్యలు  బెంగాలీ, ఇతర వర్గాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, అల్లర్లు సృష్టించేలా ఉన్నాయని సలీం ఆరోపించారు. 

పెద్ద సంఖ్యలో బెంగాలీలు రాష్ట్ర సరిహద్దుల వెలుపల నివసిస్తున్నారు. పరేష్ రావల్ చేసిన దుర్మార్గపు వ్యాఖ్యల కారణంగా వారిలో చాలా మంది పక్షపాతంతో టార్గెట్ చేయబడతారని, ప్రభావితమవుతారని తాను భయపడుతున్నానని సలీం ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు నటుడు రావల్‌పై IPC 153(అల్లర్లు సృష్టించే ఉద్దేశ్యంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం), 153A (వివిధ  వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 153B (భాషా లేదా జాతి సమూహాలకు హక్కులను నిరాకరించడం), 504 (రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. 

ఇంతకీ ఏం జరిగిందంటే..? 

గుజరాత్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో పరేష్ రావల్ మాట్లాడుతూ.. ధరల పెరుగుదల పైన, ఆమ్ ఆద్మీ పార్టీ పైన విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్లుగా.. ‘ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. కానీ కొన్ని రోజులకు వాటి ధరలు దిగొస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వస్తాయి. కానీ.అప్పటికే ఢిల్లీలో జరుగుతున్నట్లుగా  బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు మీ చుట్టూ చేరితే ఏం చేస్తారు. అప్పుడు గ్యాస్ సిలిండర్ లతో మీరేం చేసుకుంటారు?  బెంగాలీలకు ‘చేపల కూర’ వండి పెడతారా?’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

గుజరాతీలు ధరల పెరుగుదలను భరించగలరు. కానీ, ఇలాంటి పరిస్థితులను ఏ మాత్రం సహించలేరు అంటూ వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ.. కొందరు నేతలు ప్రైవేటు విమానాల్లో వచ్చి.. ఇక్కడ దిగిన తరువాత.. రిక్షాల్లో తిరుగుతూ ప్రజలకు షో చేస్తుంటారని.. కేజ్రీవాల్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

ఇదిలా ఉండగా.. రావల్ ప్రకటనపై టీఎంసీ మండిపడింది. టిఎంసి ఐటి హెడ్ దేబాంగ్షు భట్టాచార్జీ మాట్లాడుతూ.. “గ్యాస్, ఎల్‌పిజి ధరల పెరుగుదలపై మోడీ అధికారంలోకి వచ్చారు. పరేష్ రావల్ ఈ విషయాన్ని మర్చిపోతాడా? గ్యాస్ ధరలు పెరిగినప్పుడు, అది హిందువులు, ముస్లింలను ప్రభావితం చేస్తుంది. ఓ మై గాడ్ లాంటి సినిమా తీసి, మత వ్యాపారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన పరేష్ గుజరాత్‌లో రెండు ఓట్ల కోసం ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.

తన వ్యాఖ్యలు  ఇంత దుమారానికి దారితీస్తాయని ఊహించని   పరేష్ రావల్  దీనిమీద స్పందించారు.  బెంగాలీ అంటే తన ఉద్దేశం బంగ్లాదేశ్, రొహంగ్యాలు అని అర్థం అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే తన వ్యాఖ్యల వల్ల ఎవరిమనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ట్విట్టర్ వేదికగా కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios