Asianet News TeluguAsianet News Telugu

Kohinoor Diamond: కోహినూర్ విలువ ఎన్ని లక్షల కోట్లో తెలుసా?

Kohinoor Diamond: ప్రపంచంలోనే అత్యంత విలువైంది కోహినూర్ వజ్రం. శతాబ్దాల చరిత గల ఈ వజ్రం కాకతీయ రాజులు, మొఘల్ రాకుమారులు, పర్షియన్, ఆఫ్ఘన్ పాలకులు, పంజాబ్ మహారాజులు అనేక మంది చేతులు మారి చివరకు లండన్ చేరింది. సుధీర్ఘ చరిత్ర ఉన్న కోహినూర్ వజ్రం విలువ ఎన్ని లక్షల కోట్లో తెలుసా?   

Kohinoor Diamond History, Origin, Price, Curse krj
Author
First Published Apr 12, 2024, 2:05 PM IST

Kohinoor Diamond: కోహినూర్ వజ్రం. ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం. శతాబ్దాల చరిత గల ఈ వజ్రం కాకతీయ రాజులు, మొఘల్ రాకుమారులు, పర్షియన్, ఆఫ్ఘన్ పాలకులు, పంజాబ్ మహారాజులు అనేక మంది చేతులు మారి చివరకు లండన్ చేరింది. అయితే.. కోహినూర్ పుట్టుక గురించి అనేక ఊహాగానాలున్నాయి. చాలా మంది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరులో తొలిసారి కోహినూర్‌ దొరికిందని చెబుతారు.

Kohinoor Diamond History, Origin, Price, Curse krj

అయితే.. అప్పుడు దీనిని సరిగ్గా కొలిచినట్టు కచ్చితమైన ఆధారాలేవు. కానీ ప్రస్తుతం కోహినూర్‌ 105.6 క్యారెట్లు గా ఉంది. చరిత్రకారుల ప్రకారం తొలుత ఈ వజ్రం కాకతీయుల ఆధీనంలో ఉండేదట. కానీ ఢిల్లీ సుల్లాన్ల చేతిలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఓటమి పాలుకావడంతో సంధి భాగంగా అపారమైన సంపదతో పాటు కోహినూర్‌ వజ్రాన్ని కూడా ఢిల్లీ సుల్తాన్ లకు సమర్పించుకున్నాడని చరిత్రకారులు అంటారు. 

Kohinoor Diamond History, Origin, Price, Curse krj

రాజుల చేతులు మారుతూ.. రాజ్యాలు మారుతూ ..

ఈ వజ్రాన్ని 1304లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్‌ ఖిల్జీ  కాకతీయ నుంచి స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత దాన్ని సమర్‌ఖండ్‌కు పంపించారు. 1526 నాటికి ఈ కోహినూర్ వజ్రం మొఘల్‌ రాజు బాబర్‌ చేతికి వచ్చింది. ఈ వజ్రాన్ని సుల్తాన్‌ ఇబ్రహీం లోడి.. మొఘల్‌ రాజు బాబర్‌  బహుమతిగా ఇచ్చినట్లు‘బాబర్‌ నామా’ అనే గ్రంధంలో ప్రస్తవించబడింది. 

ఇలా బాబర్‌ నుంచి ఔరంగజేబు వరకు ఈ కోహినూర్ వజ్రం మొఘల్‌ రాజుల చేతులు మారుతూ వచ్చింది. ఔరంగజేబు మనవడైన సుల్తాన్‌ మహమ్మద్‌ తన తలపాగాలో కోహినూర్ వజ్రాన్ని ధరించాడని చరిత్రకారులు చెప్పుతున్నారు. సుల్తాన్‌ మహమ్మద్‌ తన స్నేహితుడైన పర్షియన్ రాజు నాదర్ షా కు బహుమతిగా ఇచ్చారంట. అప్పుడే నాదిర్‌ షా వజ్రం నాణ్యత, మెరుపును చూసి దానికి కోహినూర్‌గా నామకరణం చేశాడు. కోహినూర్ వజ్రం అంటే కాంతి పర్వతం.  

 

కోహినూర్ వజ్రాన్ని దక్కించుకున్న తరవాత పర్షియన్ రాజు నాదర్ షా 1747లో హత్యకు  గురయ్యాడు. అతని కుమారులు ఆదిల్ షా, ఇబ్రహీం కూడా చంపబడ్డారు.దీంతో అతని మనవడు షారుఖ్ కోహినూర్‌ వజ్రాన్ని ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అహ్మద్ షాకు అప్పగించినట్టు తెలుస్తోంది. కోహినూర్‌ను దక్కించుకున్న తర్వాత అహ్మద్ షా ఆకస్మికంగా మరణించాడు. షా కుమారుల మధ్య అంతర్యుద్ధం ప్రారంభమైంది. అతని ఇద్దరు కుమారులు వజ్రంతో పంజాబ్‌కు పారిపోయారు. ఈ తరువాత 1813లో  పంజాబ్ రాజైన మహారాజా రంజిత్ సింగ్ కోహినూర్‌ను దక్కించుకున్నాడు. ప్రతిఫలంగా అఫ్గాన్‌ సింహాసనం షా షుజా దక్కించుకునేందుకు రంజిత్‌ సింగ్‌ సహాయం చేశాడు. 

 

రంజిత్ సింగ్ మరణానంతరం సింహాసనం కోసం పోటీ ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన బ్రిటిష్‌ వారు పంజాబ్‌ పై ఆక్రమణంగా దండెత్తారు. ఈ క్రమంలో సిక్కు రాజులకు, బ్రిటిష్‌ వారికి మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ తరుణంలో 1849లో పంజాబ్‌ను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ రాష్ట్ర ఆస్తిని జప్తు చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ. వెంటనే కోహినూర్‌ వజ్రాన్ని లాహోర్‌లోని బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ ఖజానాకు తరలించారు. అయితే.. కొంత మంది చరిత్రకారులు కోహినూర్ వజ్రం రాజులకు కలసి రాలేదని తన వాదనను వెల్లబుచ్చుతున్నారు.  

ఇంగ్లండ్‌కు తరలింపు..

ఇలా పంజాబ్ రాజుల నుంచి జప్తు చేసుకున్న కోహినూర్ వజ్రాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లండ్ రాణి క్వీన్ విక్టోరియాకి బహుమతిగా అందించారు. ఇలా 1850లో లార్డ్ డల్హౌసీ కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లండ్‌కు పంపించారు. మొదటి సారి క్వీన్ విక్టోరియా తన కిరీటంలో కోహినూర్ వజ్రాన్ని ధరించారు. అయితే.. కోహినూర్‌ వజ్రం కాంతి తగ్గిందని భావించిన విక్టోరియా 1852లో దానికి వన్నె దిద్దించాలని నిర్ణయించారు. ఈ పనిని డచ్‌కు చెందిన జువెలర్‌ కాంటోర్‌కు అప్పగించగా కోహినూర్‌ 108.93 క్యారట్లకు తగ్గిపోయింది. 

Kohinoor Diamond History, Origin, Price, Curse krj
 
 విక్టోరియా వీలునామా.. 

కోహినూర్‌ చరిత్ర తెలుసుకున్న రాణి విక్టోరియా .. దానిని ధరించిన రాజులందరూ మరణించారని, కేవలం అరుదైన సందర్భాల్లో మహారాణులు మాత్రమే ఈ వజ్రాన్ని ధరించాలని, ఒక వేళ రాజు పాలిస్తుంటే అతడి భార్యగా రాణికి ఆ వజ్రాన్ని ధరించే హక్కుంటుందని ముందు జాగ్రత్తగా వీలునామా కూడా రాసిందట. ఇలా విక్టోరియా రాణి తరువాత విక్టోరియా పెద్ద కుమారుడైన కింగ్ ఎడ్వర్డ్ VII భార్య అలెగ్జాండ్రా 1902లో తన కిరీటంలో ధరించింది. ఇక 1911లో విక్టోరియా మనవడు కింగ్ జార్జ్-Vని వివాహం చేసుకున్న యువరాణి క్వీన్‌ మేరీ కిరీటంలో కోహినూర్ వజ్రాన్ని పొదిగారు.

Kohinoor Diamond History, Origin, Price, Curse krj

ఆ తరువాత 1937లో  క్వీన్ కన్సార్ట్  కిరీటంలో ఈ వజ్రాన్ని పొదిగారు. అలాగే..  2002లో క్వీన్‌ ఎలిజబెత్‌-2(queen elizabeth) తమ కిరీటంలో ధరించారు.  ప్రస్తుతం ఈ కోహినూరు వజ్రం టవర్‌ ఆఫ్‌ లండన్‌ వద్దనున్న జువెల్‌ హౌస్‌లో ఉంది. ఈ వజ్రాన్ని ఇవ్వాలని భారత్‌ పలుమార్లు విజ్ఞప్తి చేసినా బ్రిటన్‌ ప్రభుత్వం తిరస్కరించింది. ఇలా ఎన్నో రాజ్యాలు. రాజులు, రాణుల చేతులు మారిన ఈ కోహినూర్ వజ్రం ప్రస్తుతం విలువ సుమారు USD 20 బిలియన్లు అంటే.. ఇండియన్ కరెన్సీ ప్రకారం.. ఈ కోహినూర్ వజ్రం ధర 1.64 లక్షల కోట్ల రూపాయలు. ఇది అనేక దేశాల GDP కంటే ఎక్కువ.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios