కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Kolkata Municipal Corporation Election 2021) సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) విజయ దుంధుబి మోగించింది. మొత్తం 144 స్థానాలకు టీఎంపీ 134 స్థానాల్లో విజయం సాధించింది. 

కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Kolkata Municipal Corporation Election 2021) సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) విజయ దుంధుబి మోగించింది. మొత్తం 144 స్థానాలకు టీఎంపీ 134 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. టీఎంసీ విజయంతో కోల్‌కతా‌తో పాటుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయంపై స్పందించి టీఎంసీ అధ్యక్షురాలు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee).. ఓటర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కేఎంసీలోని మొత్తం 144 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సందర్భంగా కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాలకు వెలుపల పెట్రోల్ బాంబులు విసిరిన ఘటనల్లో పలువరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో నేడు ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. 

ఈ ఫలితాల్లో (kmc election 2021 results) తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 134 వార్డులో విజయం సాధించింది. టీఎంసీ దాదాపు 70 శాతానికి పైగా ఓట్లతో భారీ ఓట్ షేర్ సాధించింది. ఈ ఏడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన బీజేపీ ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. కేవలం మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక, కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో, లెఫ్ట్ పార్టీలు రెండు స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలుపొందారు.

దాదాపు ఓట్ షేర్ విషయానికి వస్తే తృణమూల్‌కు నాలుగింట మూడొంతులు సొంతం చేసుకుంది. ఓట్ షేర్ విషయంలో బీజేపీ కన్నా లెఫ్ట్ కూటమి కాసింత మెరుగ్గా నిలిచింది. టీఎంసీకి 71.95 శాతం, లెఫ్ట్ ఫ్రంట్‌కు 11.3 శాతం, బీజేపీకి 8.94 శాతం, కాంగ్రెస్‌కు 4.47 శాతం, స్వతంత్రులకు 3.25 శాతం ఓట్లు పోలయ్యాయి. 

ఈ ఎన్నికల్లో టీఎంసీ విజయంపై స్పందించిన మమతా బెనర్జీ.. విజయం సాధించిన తన పార్టీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. అత్యంత శ్రద్ధగా, కృతజ్ఞతతో ప్రజలకు సేవ చేయాలని గుర్తు చేశారు. టీఎంసీకి ఓటు వేసిన ఒక్కరికి ఆమె హృదయపూర్వకరంగా ధన్యవాదాలు తెలియజేశారు. ‘ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య విజయం. ప్రజలు మా పనిని అంగీకరించారనే స్పష్టమైన సందేశాన్ని పంపారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలను ప్రజలు ఓడించారు. ప్రజల ముందు తలవంచుతాం. మేము మరింత వినయంగా ఉంటాము. కోల్‌కతా మనకు గర్వకారణం. బెంగాల్, కోల్‌కతా మార్గాన్ని చూపుతాయి’ అని మమతా బెనర్జీ అన్నారు. 

‘ద్వేషం, హింస రాజకీయాలకు బెంగాల్‌లో స్థానం లేదని కోల్‌కతా ప్రజలు మరోసారి నిరూపించారు. ఇంత భారీ మెజారిటీతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మేము నిజంగా వినయపూర్వకంగా ఉన్నాము. మీ అభివృద్దికి మేము కట్టుబడి ఉంటాం. థాంక్స్ కోల్‌కతా’ అని మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. 

అయితే కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనేక హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. మమతా బెనర్జీ తన మాట తప్పారని విమర్శించారు. ‘ఇలాంటి హింస అవసరం లేదు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలకు హామీ ఇచ్చారు.. అయితే ఆమె స్వయంగా దానిని ఉల్లంఘించారు’ అని అధిర్ రంజన్ చౌదరి మంగళవారం పేర్కొన్నారు. 

ఇక, 2015లో జరిగిన కేఎంసీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 114 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో, లెఫ్ట్ పార్టీలు 15 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. తర్వాత గెలుపొందిన పలువురు కార్పొరేటర్లు.. అధికార టీఎంసీలో చేరారు. గతేడాదే కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడ్డాయి.