Asianet News TeluguAsianet News Telugu

రామ్ లీలా మైదాన్ లో ‘కిసాన్ మహాపంచాయత్’.. ఢిల్లీకి చేరుకున్న వేలాది మంది రైతులు..

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఢిల్లీలో నేడు ‘కిసాన్ మహాపంచాయత్’ సభను నిర్వహిస్తున్నారు. రామ్ లీలా మైదానంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. 

Kisan Mahapanchayat in Ram Leela Maidan..Thousands of farmers reached Delhi..
Author
First Published Mar 20, 2023, 3:40 PM IST

కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. తమ డిమాండ్ లను పరిష్కరించాలని కోరతూ రామ్ లీలా మైదానంలో ‘కిసాన్ మహాపంచాయత్’ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు రామ్ లీలా మైదానంలో 2 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 2021 డిసెంబర్ 9న లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం నెరవేర్చాలని రైతులు కోరుకుంటున్నారని రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్చా తెలిపింది. 

రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని తగ్గించడానికి కేంద్రం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంఎస్పీపై కమిటీ తమ డిమాండ్లకు విరుద్ధంగా ఉందని, దీనిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పింఛన్లు, రుణమాఫీ, రైతుల ఆందోళనలో మరణించిన వారికి పరిహారం, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

‘‘జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)కి పంపిన విద్యుత్ సవరణ బిల్లు-2022ను ఉపసంహరించుకోవాలి. ఎస్కేఎంతో చర్చించిన తర్వాతే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. అయినప్పటికీ బిల్లును ప్రవేశపెట్టింది’’ అని గత వారం సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్చా తన ప్రకటనలో తెలిపింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీష్ సిసోడియాకు ఏప్రిల్ 3 వరకు జ్యూడీషీయల్ కస్టడీ పొడిగింపు

వ్యవసాయ అవసరాలకు ఉచిత విద్యుత్, గ్రామీణ గృహాలకు 300 యూనిట్ల విద్యుత్ ఇవ్వాలని మోర్చా డిమాండ్ చేసింది. కాగా.. కేంద్రం రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మోర్చా ఏడాది పాటు ఆందోళనకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, ఎంఎస్పీకి చట్టపరమైన హామీతో పాటు రైతుల పెండింగ్ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వారు 2021 డిసెంబర్ లో ఉద్యమాన్ని నిలిపివేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios