కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్లిఖార్జున ఖర్గే గెలిస్తే.. కాంగ్రెస్ ఇప్పుడున్న మాదిరే వుంటుందని, కొత్తగా మార్పు వుండదని ఆయన పేర్కొన్నారు. 

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు హాట్ హాట్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే. పలువురి పేర్లు రేసులో వినిపించినప్పటికీ చివరికి శశిథరూర్, మల్లిఖార్జున ఖర్గేలు మిగిలారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ప్రచారాన్ని ప్రారంభించారు. గాంధీ కుటుంబ మద్ధతు వున్న మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధించే అవకాశాలు వున్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శశిథరూర్ మాట్లాడుతూ... ఇదేమీ యుద్ధం కాదని, తామేమీ శత్రువులం కాదన్నారు. ఇప్పుడు జరిగితే తమ పార్టీ భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. 

ఖర్గే కాంగ్రెస్‌లోని టాప్ 3 నేతల్లో ఒకరని... అయినప్పటికీ ఆయన పార్టీలో ఎలాంటి మార్పులను తీసుకురాలేని శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఉన్న వ్యవస్థలనే మల్లిఖార్జున ఖర్గే కొనసాగిస్తారని.. కానీ కేడర్ కోరుకుంటున్న మార్పు తనతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతోన్న వారి మధ్య చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయాలని శశిథరూర్ డిమాండ్ చేశారు. దీని ద్వారా పార్టీ సభ్యుల అభిప్రాయాలను తెలసుకునే వీలుంటుందని ఆయన అన్నారు. అయితే నెహ్రూ- గాంధీ కుటుంబీకులకు కాంగ్రెస్ శ్రేణుల హృదయాల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం వుంటుందని శశిథరూర్ పేర్కొన్నారు. 

Also REad:మార్పు కోరుకుంటే నాకు ఓటేయ్యండి... కాంగ్రెస్ సభ్యులకు శశిథరూర్ పిలుపు

ఇకపోతే.. శశిథరూర్ మరో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన మేనిఫెస్టో విడుదల చేశారు. అయితే అందులో ప్రచురించిన ఇండియా మ్యాప్‌లో జమ్మూకాశ్మీర్, లఢఖ్ లేవు. దీనిపై పెనుదుమారమే రేగింది. సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు నెటిజన్లు. దీనిపై తక్షణం స్పందించిన శశిథరూర్ అందరికీ క్షమాపణలు చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని.. వాలంటీర్ల బృందం పొరపాటు చేసిందని వివరణ ఇచ్చారు. వెంటనే దీనిని సవరించామని.. జరిగిన పొరపాటుకు క్షమించాలని కోరారు శశిథరూర్. ఈ మేరకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించిన మేనిఫెస్టో కాపీలను ట్వీట్ చేశారు. 

అయితే శశిథరూర్ ఇండియా మ్యాప్‌కు సంబంధించి తప్పు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2019 డిసెంబర్‌లో భారత పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తున్న సమయంలోనూ ఓ ట్వీట్ చేసి అందులోనూ ఇలాంటి తప్పు చేశారు . దీనిపై బీజేపీ నేతలతోపాటు నెటిజన్లు విరుచుకుపడటంతో థరూర్ వెంటనే ట్వీట్‌ను డిలీట్ చేశారు. 

కాగా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో శశిథరూర్‌తో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కేఎన్ త్రిపాఠిలు కూడా శుక్రవారం నామినేషన్‌లు దాఖలు చేశారు. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. పోటీలో ఒకరికి మించి అభ్యర్థులు వున్న పక్షంలో అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి.. అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే కెఎన్‌ త్రిపాఠి దాఖలు చేసిన నామినేషన్‌ శనివారం తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యింది. దీంతో ‌మల్లికార్జున్ ఖ‌ర్గే, ఎంపీ శశిథరూర్‌ మధ్య పోటీ ఉండ‌నుంది.