వేర్పాటువాద నేత, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జలందర్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో పంజాబ్‌లోని పలు చోట్ల మొబైల్ ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. 

న్యూఢిల్లీ: వేర్పాటువాద నేత, ఖలిస్తాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ ది చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జలందర్‌లోని నకోదార్‌ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేయడానికి పంజాబ్ పోలీసులు ప్రత్యేకంగా యాక్షన్ చేపట్టారు. ఈ యాక్షన్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉన్నదని ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు రద్దు చేసింది. ఈ తరుణంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో పంజాబ్ ప్రభుత్వం నిరంతరం టచ్‌లో ఉన్నది.

జలందర్‌లో అంతకు ముందే ఆరుగురు అమృత్‌పాల్ సింగ్ సహాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎవరికీ తెలియని లొకేషన్‌లో ప్రశ్నిస్తున్నారు.

అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేయడానికి సుమారు 50 పోలీసు వాహనాలు రంగంలోకి దిగాయి. అమృత్‌పాల్ సింగ్, అతని అనుచరులను అరెస్టు చేయడానికి వెంట పడ్డాయి. అమృత్‌పాల్ సింగ్ చివరి లొకేషన్‌ను షాకోట్ సమీపంలో పోలీసులు గుర్తించారు.

Also Read: లిక్కర్ బాటిళ్లపై రూ. 10 చొప్పున గోవు పన్ను.. రాష్ట్ర బడ్జెట్‌లో నిర్ణయం.. ఏ పార్టీ ప్రభుత్వమో తెలుసా?

పంజాబ్‌లోని చాలా ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రేపటి వరకు కొనసాగనున్నాయి. 

గత నెలలో అమృ‌త్‌పాల్ సింగ్, ఆయన మద్దతుదారులు పోలీసు బారికేడ్లు ధ్వంసం చేస్తూ అజ్నాల పోలీసు స్టేషన్‌లో వీరంగం సృష్టించారు. ఆయుధాలతో పోలీసు స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. పోలీసు సిబ్బందితో ఘర్షణలకు దిగారు. అల్లర్లు చేశాడని తమలో ఒకడిని అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. అతడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.