హిమాచల్ ప్రదేశ్‌లో ధర్మశాలలోని అసెంబ్లీ కాంప్లెక్స్ గేటుపై ఖలిస్తాన్ జెండాలు కనిపించాయి. అసెంబ్లీ సరిహద్దు గోడలపై ఖలిస్తాన్ అనుకూల గ్రాఫిటీ రాతలు వెలిశాయి. ఈ రోజు ఉదయం ఇవి కనిపించాయి. నిన్న రాత్రి ఈ పని జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పంజాబ్ నుంచి వచ్చిన పర్యాటకులే ఈ పనికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలూ కూడా ఉన్నాయి. 

చండీగడ్: ఖలిస్తాన్‌లు దుశ్చర్యకు పాల్పడ్డారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గేటుపై ఖలిస్తాన్‌ల జెండాను ఉంచారు. అసెంబ్లీ సరిహద్దు గోడలపై ఖలిస్తాన్ అనుకూల రాతలు రాశారు. ఈ రోజు ఉదయం ఖలిస్తాన్ జెండాలు, రాతలు అసెంబ్లీ గేటు, గోడలపై కనిపించాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై సీఎం జైరాం ఠాకూర్ సీరియస్ అయ్యారు. బహుశా పంజాబ్ నుంచి రాష్ట్రంలోకి వచ్చిన పర్యాటకులు పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సీఎం జైరాం ఠాకూర్.. పొరుగు రాష్ట్రాలు జమ్ము కశ్మీర్, లడాఖ్, ఉత్తరాఖండ్,హర్యానా, పంజాబ్‌లతో రాష్ట్ర సరిహద్దులో సెక్యూరిటీ పరిస్థితులను సమీక్షించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు దేశవ్యాప్తంగా పర్యాటకుల నుంచి మంచి ఆదరణ ఉన్నది.

హిమాచల్ ప్రదేశ్‌లో శీతాకాల సమావేశాలు నిర్వహించే ధర్మశాలలోని అసెంబ్లీ భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బహుశా నిన్న రాత్రి లేదా ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగి ఉండొచ్చని కంగ్రా రీజియన్ పోలీసు చీఫ్ ఖుశల్ శర్మ వివరించారు.

తాము ఆ ఖలిస్తాన్ జెండాలను విధాన సభ గేట్ల నుంచి తొలగించామని తెలిపారు. పంజాబ్ నుంచి తమ రాష్ట్రానికి వచ్చిన పర్యాటకుల పనే ఇది కావొచ్చని వివరించారు. ఈ ఘటనపై తాము కేసు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు.

అయితే, ఏప్రిల్ 26వ తేదీన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉన్నదని ఇది వరకే సంకేతాలు ఇచ్చారు.

ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపట్వంత్ సింగ్ పన్ను పేరిట ఓ లేఖ హిమాచల్ ప్రదేశ్ సీఎంకు లేఖ విడుదల అయిందని, భింద్రాన్వాలే, ఖలిస్తాన్ జెండాలను షిమ్లాలో ఎగరేస్తామని అందులో పేర్కొన్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ భింద్రాన్వాలే, ఖలిస్తానీ జెండాలతో వచ్చే వాహనాలను నిషేధంచాయి. ఈ సంస్థ మార్చి 29వ తేదీన ఖలిస్తాన్ జెండా ఎగరేస్తామని పేర్కొంది. కానీ, హెవీ సెక్యూరిటీ కారణంగా ఆ పని చేయలేదని తెలుస్తున్నది.

కాగా, ఈ ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. ఈ పిరికిపంద చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. ధర్మశాలలోని అసెంబ్లీ కాంప్లెక్స్‌లో రాత్రిపూట ఖలిస్తాన్ జెండాలను ఉంచడం పిరికిపంద చర్యనే అని వివరించారు. ఇక్కడ శీతాకాల సమావేశాలు జరుగుతాయని, ఆ సమయంలోనే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుందని తెలిపారు. దీన్ని అదునుగా తీసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనను వెంటనే దర్యాప్తు చేస్తారని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దమ్ము ఉంటే రాత్రిపూట కాకుండా పగటి పూట ఆ పని చేసే ధైర్యం చేయండని సవాల్ విసిరారు.