ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో మనకు కొన్ని స్పష్టమైన విషయాలు అర్థం అవుతున్నాయి. పీఎం మోడీ, సీఎం యోగి ఛరిష్మా తగ్గలేదని, త్వరలోనే ఆప్ ఇతర రాష్ట్రాలకు.. దేశవ్యాప్తంగా రెక్కలు చాచే అవకాశాలున్నాయని అవగతం అవుతుంది. కాంగ్రెస్ నిర్లక్ష్యం, బద్ధకం, ఉదాసీనతకు పంజాబ్, గోవా ప్రజలు సమాధానం ఇచ్చారని చూడొచ్చు.  

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కొన్ని సీట్ల ఫలితాలు తేలాల్సి ఉన్న స్థూలంగా మెజార్టీ పొందే పార్టీలపై స్పష్టత వచ్చింది. ఈ ఫలితాల ఆధారంగా మనం కొన్ని విషయాలను కచ్చితంగా అంచనా వేయవచ్చు. ఈ ఫలితాల రోజున జాతీయ రాజకీయాల్లోనూ కొన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయి. వాటినీ చర్చిద్దాం. 

మొదట ఈ రోజు అంటే మార్చి 10న వెలువడ్డ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో రెండు కొత్త రికార్డులు సెట్ అయ్యాయి. ఒకటి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వరుసగా రెండో సారి అధికారంలోకి వస్తున్నది. రెండవది.. ఇటీవలి కాలంలో కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ మినహా రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్న పార్టీగా ఆప్ అవతరించింది. ఇటీవలి కాలం అని ఎందుకు పేర్కొన్నామంటే.. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ఏకకాలంలో ఒకటికి మించిన రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. కానీ, 1989 నుంచి అంటే.. కాంగ్రెస్ ప్రాభవం కుచించుకువస్తున్నప్పటి నుంచి కేవలం కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ మాత్రమే ఒకటికి మించిన రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్నాయి. ఇప్పుడు ఆ అరుదైన జాబితాలో ఆప్ చేరింది.

ఈ రోజు బీజేపీకి కూడా ప్రత్యేకమే. ఎందుకంటే ఎన్నికలకు వెళ్లిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. పీఎం మోడీ, సీఎం యోగి ఇద్దరూ తమ ప్రాభవం కోల్పోలేదని స్పష్టం చేసుకున్నారు. యూపీలో గెలిచి సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. 

2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సరైనవారని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు యోగి ఆదిత్యానాథ్(వైఏ) వర్సెస్ అఖిలేశ్ యాదవ్(ఏవై)గా చూశారు. కాగా, బెహెన్ జీ మాయావతి, కాంగ్రెస్‌లు పోటీలో వెనుకంజలోనే కొనసాగాయి. ఈ రెండు పార్టీలూ ఊహించని విధంగా క్షీణించిపోయాయి. బీఎస్పీ ఒక సీటు, కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితం అయ్యాయి. యూపీ విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపు నిజమయ్యాయి. 

ఉత్తరాఖండ్, మణిపూర్‌లనూ బీజేపీ సులువుగానే దక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేక చతికిలపడిపోయింది. ఉత్తరాఖండ్‌లో సీఎం క్యాండిడేట్ హరీష్ రావత్ కూడా పెద్దగా ప్రభావం వేయలేకపోయారు. కాగా, గోవా మాత్రం కాంగ్రెస్ గుణపాఠం నేర్పింది. కాంగ్రెస్ నిర్లక్ష్యానికి, బద్ధకానికి కోలుకోలేని సమాధానం ఇచ్చింది. 2017లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని నిర్లక్ష్యానికి కాంగ్రెస్ ఈ సారి కూడా మూల్యం చెల్లించక తప్పలేదు. అప్పుడు చాకచక్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న బీజేపీ ఇప్పుడు అధికారాన్ని సుస్థిరం చేసుకున్నది.

ఈ ఎన్నికల ఫలితాలు మనకు మరికొన్ని అంశాలు విశదపరుస్తున్నాయి. మొదటిది బీజేపీ లేదా పీఎం మోడీ ఛరిష్మా ఇంకా మసకబారలేదని, ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ మంచి ఆదరణ ఇంకా ఉన్నదని స్పష్టమైంది. కాగా, మరో ముఖ్యమైన అంశం ఆప్ విజయం. పంజాబ్‌లో అధికారాన్ని ఏర్పాటు చేయడమే కాదు.. గోవాలోనూ ఈ పార్టీ బోణీ కొట్టింది. అంతటితో ఆప్ ఆగబోదని, దేశవ్యాప్తంగా రెక్కలు చాచే అవకాశం ఉన్నది.

గ్రూపు రాజకీయాలను పరిష్కరించడం, అంతర్గత విభేదాలు రచ్చకెక్కిన కిక్కురుమనకుండా ఉండటం వంటి స్వభావాలు కాంగ్రెస్‌ను పంజాబ్‌లో నట్టేట ముంచాయి. చివరి నిమిషంలో కులం, ఇతర అస్తిత్వ కార్డును ఉపయోగిస్తే ప్రయోజనం ఏమీ ఉండదనీ తెలిసివచ్చేలా ఈ ఫలితాలు కాంగ్రెస్ పాఠాలు నేర్పాయి. నవజోత్ సింగ్ సిద్దూ, కెప్టెన్ అమరీందర్ సింగ్‌ల మధ్య విభేదాలపై ఉదాసీనంగా వ్యవహరించి చివరకు దళిత్ కార్డు ద్వారా ఎన్నికల్లో లబ్ది పొదాలని సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ ఎంచుకుంది. అప్పుడూ చన్నీ, సిద్దూల మధ్య ఘర్షణలనూ సమర్థంగా పరిష్కరించలేదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా వారిమధ్య వైరం కొనసాగింది. దాని పర్యావసనమే ఈ ఫలితాలు. పంజాబ్ ప్రజలకూ కాంగ్రెస్‌పై విసుగుపుట్టినట్టు ఫలితాలు చెబుతున్నాయి. అందుకే బహుశా కెప్టెన్ అమరీందర్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, నవజోత్ సింగ్ సిద్దూలు ముగ్గురూ పరాజయం పాలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోనూ ప్రియాంక గాంధీ మహిళ అనే అస్తిత్వ కార్డు ప్లే చేశారు. కానీ, అది వర్కవుట్ కాలేదు.

చివరగా.. ఈ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రపతి ఎన్నికలనూ బీజేపీ సులువుగా హ్యాండిల్ చేయగలిగే పొజిషన్‌కు వెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లో మంచి ఫలితాలు రావడంతో తాము నామినేట్ చేసిన అభ్యర్థిని రాష్ట్రపతి భవన్‌కు కచ్చితంగా పంపే బలాన్ని బీజేపీ సంపాదించుకుంది. ఉపరాష్ట్రపతిని తాము ఎంపిక చేసినవారే అయ్యే బలాన్ని చేకూర్చుకుంది. రాష్ట్రపతి ఎన్నికలు మరో మూడు నాలుగు నెలల్లో జరుగుతాయి.