కేరళ కన్నూరులోని పానూరులో శనివారం 23 ఏళ్ల విష్ణుప్రియ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

కేరళ కన్నూరులోని పానూరులో శనివారం 23 ఏళ్ల విష్ణుప్రియ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విష్ణుప్రియను ఆమె ఇంట్లోనే హత్య చేసిన శ్యామ్ జిత్‌ను అరెస్ట్ చేసిన.. హత్య వెనక కారణాలను తెలుసుకుంటున్నారు. వివరాలు.. పానూరులో నివాసం ఉంటున్న విష్ణుప్రియ తండ్రి వినోద్ ఖతార్‌లో పనిచేస్తున్నారు. ఆమె పానూరులోని ఓ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌లో పనిచేస్తోంది. ఆమెకు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు.

అయితే మనంతేరికి చెందిన శ్యామ్‌జిత్ తనను ప్రేమించమని విష్ణుప్రియపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయితే శ్యామ్‌జిత్‌ను విష్ణుప్రియ దూరం పెట్టింది. ఈ క్రమంలోనే విష్ణుప్రియపై కోపం పెంచుకున్న శ్యామ్ జిత్‌ ఆమెను హత్య చేసేందుకు ప్రణాళిక రచించాడు. విష్ణుప్రియ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్లిన శ్యామ్‌జిత్ తన వెంట తీసుకొచ్చిన ఆయుధాలతో ఆమెపై దాడి చేశాడు. గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే మధ్యాహ్నం ఇంటికి వచ్చిన విష్ణుప్రియ తల్లి.. కూతురు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్‌కు గురైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. 

మృతదేహం లభించిన గదిలో గొడవ జరిగినట్లు ఆనవాళ్లు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. అయితే శ్యామ్ జిత్ మాస్క్ ధరించి ఉండటంతో అతడిని గుర్తించలేకపోయారు. దీంతో పోలీసులు విష్ణుప్రియ కాల్ రికార్డ్స్ ఆధారంగా శ్యామ్ జిత్ ఈ హత్య చేసినట్టుగా గుర్తించారు. 

ఇక, విష్ణుప్రియను హత్య చేసిన అనంతరం బైక్‌పై మనంతేరికి వెళ్లిన శ్యామ్‌జిత్‌.. ఇంటి సమీపంలోని గుంతలో బ్యాగ్‌ను దాచాడు. తర్వాత ఇంటికి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుని మనంతేరికి తన తండ్రి హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న సమయంలోనే పోలీసులు శ్యామ్‌జిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించి మొత్తం కథను బయటపెట్టాడు. ప్రేమ వైఫల్యమే దాడికి కారణమని నిందితుడు శ్యామ్ జిత్ అంగీకరించాడని.. గొంతు కోసే ముందు మహిళ తలపై కొట్టాడని ఏసీపీ ప్రదీపన్ తెలిపారు.

అలాగే పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు కూడా వచ్చాయి. శ్యామ్ జిత్ మరో హత్య కూడా చేయాలని భావించాడని తెలుస్తోంది. పొన్నానికి చెందిన విష్ణుప్రియ స్నేహితుడిని కూడా హత్య చేయాలని చూసినట్టుగా పోలీసులు గుర్తించారు. అతడు విష్ణుప్రియతో ప్రేమలో ఉన్నాడనే అనుమానంతో హత్యకు ప్రణాళికలు రచించాడని సమాచారం. అయితే ఈలోపే పోలీసులకు పట్టుబడటంతో.. ఆ ప్లాన్‌ను శ్యామ్ జిత్ అమలు చేయలేకపోయాడు. 

ఇక, విష్ణుప్రియ నివాసానికి వచ్చిన శ్యామ్‌జిత్.. ఆ సమయంలో ఆమె తన ఫ్రెండ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడటం కనిపించింది. వెంటనే శ్యామ్‌జిత్.. విష్ణుప్రియ తలపై కొట్టాడు. అయితే విష్ణుప్రియ తలపై కొట్టడం వీడియో కాల్‌లో మాట్లాడుతున్న ఆమె ఫ్రెండ్‌ చూసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో అతడిని సాక్షిగా చేర్చేందుకు పోలీసులు ఆలోచన జరుపుతున్నారు. ఇదిలా ఉంటే.. విష్ణుప్రియను హత్య చేసినందుకు శ్యామ్‌జిత్‌లో ఎలాంటి బాధ కనిపించడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

అయితే శ్యామ్‌జిత్ వెంటనే దేశం విడిచి వెళ్లాలని ప్లాన్ చేశాడని, అయితే గంటల వ్యవధిలోనే అతడిని పట్టుకోవడంతో అందుకు అవకాశం లేకుండా పోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.