Asianet News TeluguAsianet News Telugu

అయ్యయ్యో దేవభూమి: వరదలతో కేరళ పర్యాటకం ఆగమాగం!

భారీ వరదలతో కేరళ పర్యాటక రంగం బాగా దెబ్బతింది. వరదల వల్ల ప్రాథమిక అంచనా ప్రకారం రూ.8,316 కోట్ల నష్టం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. దీని ప్రభావం దీర్ఘ కాలికంగా ఉంటుందని సీఎం పినరయి విజయన్ తెలిపారు.
 

Kerala suffers 80 percent tourism cancellations, government says overall loss due to floods is Rs 8316 cr
Author
Kerala, First Published Aug 20, 2018, 11:24 AM IST

తిరువనంతపురం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళకు భీకర నష్టం వాటిల్లుతున్నది. పర్యాటక రంగం నుంచి ప్రధానంగా ఆదాయం పొందుతున్న ఈ రాష్ర్టానికి ప్రస్తుత వాతావరణం పెను శాపమైంది. రోడ్లు, రైల్వే, విమానయానం, సముద్ర మార్గం ఇలా అన్ని దారులూ మూసుకుపోవడంతో రాష్ట్రానికి రాబడి తగ్గిపోయింది. వరదలతో పర్యాటకులెవరూ కేరళకు రాలేని పరిస్థితి నెలకొన్నది. ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటుందో చెప్పలేని దుస్థితి నెలకొంది.

పర్యాటకానికి రూ.20 వేల కోట్ల వరకు నష్టం: అసోచాం
పర్యాటక రంగానికి రూ.15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు నష్టం రావచ్చని అసోచామ్ అంచనా వేసింది. రాష్ట్రంలోని కొచి, ఇతర నౌకాశ్రయాల నుంచి వాణిజ్య లావాదేవీలు దాదాపు నిలిచిపోయాయన్నది. ఇప్పటిదాకా వాటిల్లిన ప్రాథమిక నష్టం మొత్తం రూ.8,316 కోట్లపైనే ఉంటుందని కేరళ సీఎం పినరయి విజయన్ చెప్పారు. కేరళపై ఈ విపత్తు ప్రభావం దీర్ఘకాలంగానే ఉంటుందన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 20,000 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, 10,000 కిలోమీటర్ల మేర రహదారులు పాడైపోయాయని తెలిపారు. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న ఓనం ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. దీనివల్ల గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించాల్సి ఉండగా, వర్షాలతో రద్దయ్యాయి. 

12 ఏళ్లకోసారి మున్నార్ కొండల్లో కనిపించే నీలకురింజి పుష్పం
ఇక 12 ఏళ్ల కోసారి మున్నార్ కొండల్లో కనిపించే నీలకురింజి పుష్పం కోసం భారీ స్థాయిలో పర్యాటకులు తరలి వస్తారు. కానీ ఎడతెరిపి లేని వర్షాలతో పర్యాటకులు తమ ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. ఇడుక్కి, వయనాడ్ జిల్లాలు కేరళలో పర్యాటక రంగానికి పెట్టింది పేరుగా నిలిచాయి. వీటికి తోడు జల పాతాలు, నదుల మధ్య, సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఫేమస్ స్నేక్ బోట్ రేస్‌లు నిర్వహించాలని తలపెట్టిన పర్యాటక శాఖ తాజా పరిస్థితుల్లో రద్దు చేసుకున్నది. స్నేక్ బోట్లు, చుండాన్ వల్లామ్ ఒక్కొక్కటి 100 నుంచి 120 అడుగుల పొడువు ఉంటాయి. ఒక్కో బోటులో వంద మందిని తీసుకెళ్లొచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే చాంపియన్స్ బోట్ లీగ్ ఈ నెల 11 నుంచి నిర్వహించాల్సి ఉన్నా వాయిదా పడింది. అలప్పుజలో వార్షిక నెహ్రూ బోట్ రేస్ త్వరలో నిర్వహిస్తామని కేరళ టూరిజం శాఖ డైరెక్టర్ పీ బాల కిరణ్ చెప్పారు. 

స్తంభించిన వ్యాపార లావాదేవీలు.. మదుపర్లలో ఆందోళన
వరదల ధాటికి వ్యాపార లావాదేవీలు కేరళలో స్తంభించిపోయాయి. స్టాక్ మార్కెట్లలో లిస్టయిన కేరళకు చెందిన సంస్థలకు చెందిన మదుపరుల్లో ఆందోళన చెలరేగుతున్నది. బ్యాంకింగ్ రంగానికే వస్తే సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ బ్యాంకుల మొత్తం శాఖల్లో దాదాపు సగం కేరళలోనే ఉన్నాయి. ఇక ఇతర బ్యాంక్ లావాదేవీలకు ఆటంకం ఏర్పడగా, ఏటీఎంలు మూతబడి నగదు కొరత ఇబ్బందులూ మళ్లీ వచ్చిపడ్డాయి. బంగారం తాకట్టుపై రుణాలనిచ్చే సంస్థలైన మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్, ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్ లావాదేవీలకూ అంతరాయం ఏర్పడింది. కేరళకు చెందిన వీ-గార్డ్, కిటెక్స్ గార్మెంట్స్‌తోపాటు కొచి షిప్‌యార్ట్ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఫినోలెక్స్, సుప్రీం ఇండస్ట్రీస్ వంటి ప్లాస్టిక్ పైపింగ్ పరిశ్రమ, వైర్ల తయారీ సంస్థల ఆదాయానికీ వర్షాలు గండికొట్టాయి.

దక్షిణ రాష్ట్రాల సిమెంట్ మార్కెట్‌లో కేరళ వాటా 13 - 14 శాతం 
సిమెంట్ తయారీ పరిశ్రమనూ ఈ వర్షాలు ప్రభావితం చేశాయి. దక్షిణ రాష్ట్రాల మార్కెట్లలో కేరళ వాటా 13-14 శాతం. నిర్మాణాలు నిలిచిపోవడంతో ప్రభుత్వ రంగ మలబార్ సిమెంట్స్‌ సహా రామ్‌కో, జేకే సిమెంట్ తదితర సంస్థల ఆదాయం పడిపోయింది. శ్రీ సిమెంట్, ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్, దాల్మియా భారత్ సంస్థలపైనా పాక్షిక ప్రభావం కనిపిస్తున్నది. మురుగప్ప గ్రూప్‌నకు చెందిన కార్బోరండం యూనివర్సల్ లిమిటెడ్ జలవిద్యుదుత్పత్తి ప్లాంట్‌కూ వరద దెబ్బ తగిలింది. ఇక్కడ ఉత్పత్తి నిలిచిపోగా, ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

దక్షిణ రాష్ట్రాల మధ్య ట్రూజెట్ ఉచిత రవాణా
వర్షబీభత్సంతో అతలాకుతలం అవుతున్న కేరళకు మూడు రోజులపాటు ఉచితంగా సహాయ సామగ్రిని రవాణా చేయడంతో పాటు కేరళలో చిక్కుకున్న ప్రయాణికులను తిరువనంతపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్, చెన్నైలకు ఉచితంగా తేనున్నట్టు విమానయాన సంస్థ ట్రూజెట్ ప్రకటించింది. తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సేకరించిన ఆహారం, దుస్తులు, ఔషధాలు వంటి వస్తువులను వచ్చే మూడు రోజులపాటు ఉచితంగా కేరళకు రవాణా చేయనున్నట్టు ట్రూజెట్ సీఈవో విశోక్‌మాన్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఉదయం ఐదు గంటలకు బయలు దేరే విమానంలో వస్తువులను తరలించడంతో పాటు తిరువనంతపురం నుంచి తిరుగు ప్రయాణంలో అక్కడ చిక్కుకుకున్న ప్రయాణీకులను ఉచితంగా హైదరాబాద్, చెన్నైలకు తీసుకురానున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios