న్యూఢిల్లీ: కేరళలో గర్భంతో ఉన్న ఏనుగు  పేలుడు పదార్ధాలు ఉన్న కొబ్బరి తిని మరణించింది. ఈ ఘటన మరువక ముందే ఇదే తరహాలో హిమాచల్ ప్రదేశ్ లో ఓ ఘటన చోటు చేసుకొంది.

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని బిలాసుపూర్  జిల్లా జాందుత్తలో ఓ ఆవుకు పేలుడు పదార్ధాలు పెట్టారు. పొరుగింటి వ్యక్తి తన ఆవుకు పేలుడు పదార్ధాలు పెట్టారని  ఆవు యజమాని గురుదయాళ్ సింగ్ ఆరోపించారు.

also read:కేరళ ఏనుగు మృతికి కారణమిదీ: మరికొందరి కోసం గాలింపు

ఈ మేరకు ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.  ఆవు గాయపడిన మరునాటి నుండి గురుదయాల్ సింగ్ పొరుగున నివాసం ఉండే నందలాల్ అనే వ్యక్తి పారిపోయాడు. 

పేలుడు పదార్ధం కారణంగా ఆవు దవడ ఛిద్రమైంది. గోధుమల్లో పేలుడు పదార్ధాలు నింపి ఇవ్వడం వల్లే  ఆవు గాయపడిందని పోలీసులు చెప్పారు. ఈ గాయం కారణంగా ఆవు మేత తినలేకపోతోంది. ఈ ఘటనపై ఆవు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనను బిలాస్‌పూర్ పోలీస్ సూపరింటెండ్ దివాకర్ శర్మ ధృవీకరించారు. ఈ కేసులో ఐపీసీ 286 సెక్షన్ కింద జంతువులపై హింసను నిరోధించే చట్టంలోని సెక్షన్ 11 కింద ఎప్ఐఆర్ నమోదు చేసినట్టుగా చెప్పారు. 

ఈ ఘటనపై ఇంతవరకు ఎవరిని కూడ అరెస్ట్ చేయలేదని ఆయన తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.