కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో నిర్లక్ష్యం వహించినందున కేరళ మరోసారి మూల్యం చెల్లించుకుంటోందన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో నిర్లక్ష్యం వహించినందున కేరళ మరోసారి మూల్యం చెల్లించుకుంటోందన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్. సండే సంవాద్ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓనం ఉత్సవాల నాడు ప్రజలు భారీ సమూహాలుగా తిరిగారని హర్షవర్థన్ చెప్పారు. ఈ సందర్భంగా మలయాళీలు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని.. దీనికి కేరళ మూల్యం చెల్లిస్తోందని ఆయన పేర్కొన్నారు.

దీనిని పాఠంగా తీసుకుని మిగిలిన రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరించాలని హర్షవర్థన్ సూచించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ సంప్రదాయ పద్ధతిలో వారి ఇంటి వద్దే పండుగ జరుపుకోవాలని ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Also Read:భారతీయులకు గుడ్‌న్యూస్: ఫిబ్రవరికి కరోనా ఖతం.. కేంద్ర కమిటీ ప్రకటన

ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు కేరళలో ఓనం వేడుకలు జరిగాయి. ఇవి పూర్తైన కొన్ని రోజులకే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా సెప్టెంబర్‌ 8 నుంచి కేసుల సంఖ్య భారీగా పెరిగింది.

ఇలా సెప్టెంబర్‌ నెలలోనే దాదాపు 32శాతం పెరుగుదల నమోదైందని కేంద్రం నియమించిన ఓ కమిటీ స్పష్టం చేసింది. జనవరి 30- మే 3 మధ్యకాలంలో కేరళలో కేవలం 499 కేసులు, రెండు మరణాలు మాత్రమే చోటుచేసుకున్నాయి.

ఆ సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా నియంత్రించగలిగింది. కానీ, ఓనం పండుగ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేరళలో ఇప్పటివరకు కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 3లక్షల 30వేలకు చేరుకున్నాయి, వీరిలో 1139 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో తొలి యాభైవేల కేసులు నమోదుకావడానికి 203 రోజులు పట్టగా, తర్వాత 50వేల కేసులు కేవలం 23రోజుల్లోనే నమోదయ్యాయి.