కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతుందా..? వైరస్ ఉద్ధృత దశను దాటేసిందా..? అంటే అవుననే చెబుతోంది కేంద్ర ప్రభుత్వ కమిటీ. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భారత్‌లో కరోనా వైరస్ కనుమరుగవుతుందని స్పష్టం చేసింది.

భారత్‌లో కోవిడ్ 19 ఉద్ధృత దశను దాటిందని.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ మహమ్మారి అంతమవుతుందని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ స్పష్టం చేసింది. భారత్‌లో లాక్‌డౌన్ విధించకుంటే జూన్‌కే కోటీ 40 లక్షల కేసులు నమోదయ్యేవని, అలాగే మరణాలు 25 లక్షలు దాటేవని కమిటీ అభిప్రాయపడింది.

చలికాలం, పండుగల వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం 30 శాతం మందిలో కరోనా నిరోధక శక్తి వుందని కమిటీ అభిప్రాయపడింది. కేరళలో ఓనం తర్వాత కేసులు పెరిగిన సంగతిని కమిటీ గుర్తుచేసింది.

కోవిడ్ నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాలను విధిగా పాటించాలని ప్రజలను కోరింది కమిటీ. 2021 ఫిబ్రవరి నాటికి దేశంలో ఒక కోటి 5 లక్షల మంది మహమ్మారి బారిన పడతారని కమిటీ అంచనా వేసింది.

ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 75 లక్షలకు చేరాయి. అదే సమయంలో శీతాకాలంలో భారత్‌లో రెండో విడత కరోనా కేసుల ఉద్ధృతి పెరిగే అవకాశం లేకపోలేదని నీతి అయోగ్ సభ్యులు వీకే పాల్ హెచ్చరించారు. వ్యాక్సిన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే దానిని ప్రజలందరికీ అందుబాటులోకి అందించే విధంగా అన్ని ఏర్పాట్లు సిద్థం చేశామని ఆయన చెప్పారు.