కేరళ మంత్రి సుధాకరణ్ భార్య జూబిలీ నవప్రభ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన భర్తకు ఉన్న పలుకుబడి కారణంగానే ఆమెకు ఉద్యోగం వచ్చిందన్న ఆరోపణలు ఖండించిన ఆమె.. తన ఉద్యోగానికి ఆదివారం రాజీనామా చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మంత్రి సుధాకరణ్ భార్య జూబిలీ నవప్రభ.. అలప్పుజాలోని ఓ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కాగా.. ఇటీవల ఆమె కేరళ యూనివర్శిటీలోని మేనేజ్ మెంట్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కి డైరెక్టర్ గా నియమితులయ్యారు. అయితే.. భర్త మంత్రి కావడం వల్లే  ఆమెకు ఆ పదవి దక్కిందని విమర్శలు మొదలయ్యాయి.

ఆ విమర్శలకు నవప్రభ ఆదివారం పులిస్టాప్ పెట్టారు. తాను తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను వైఎస్ ప్రిన్సిపల్ గా రిటైర్ అయిన తర్వాత ఓ పత్రికలో వచ్చిన అడ్వర్టైజ్ మెంట్ చేసి.. కేరళ యూనివర్శిటీలో ఉద్యోగానికి అప్లై చేశానని ఆమె చెప్పారు. ఈ ఉద్యోగం రావడంలో తన భర్త పాత్ర లేదని వివరించారు.

‘‘ నా భర్త.. 36 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు చాలా క్లీన్ ట్రాక్ ఉంది. నా ఉద్యోగం లో ఆయన పాత్ర లేదు.  ప్రస్తుతం నాకు ఉద్యోగం ముఖ్యం కాదు. నా భర్త విశ్వసనీయత ముఖ్యం. అందుకే ఈ ఉద్యోగాన్ని చెత్తకుప్పలో పడేసినట్లు.. రాజీనామా చేస్తున్నాను’’ అని ఆమె ప్రకటించారు.