వాట్సాప్ ద్వారా విడాకులు అడిగిన భర్త.. పోలీసులను ఆశ్రయించిన భార్య.. అసలేం జరిగిందంటే?
వాట్సాప్ ద్వారా ఓ వ్యక్తి తన భార్యకు విడాకులు చెప్పాడు. విదేశాల్లో ఉన్న ఆయన ట్రిపుల్ తలాఖ్ చెప్పి విడాకులు ప్రకటించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించక తప్పలేదు.

తిరువనంతపురం: కేరళలో ఓ మూర్ఖుడు టెక్నాలజీ సహాయంతో మరింత అధోపాతాళానికి వెళ్లాడు. విదేశాల్లో ఉన్న అతడు తన భార్యకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. ఆమెకు విడాకులు ఇచ్చినట్టు ప్రకటించాడు. ఇద్దరు కూతుళ్లను కన్న తర్వాత సింపుల్‌గా మూడు సార్లు తలాఖ్ అని చెప్పి విడాకులు ఇచ్చినట్టు స్పష్టం చేశాడు. నిర్ఘాంతపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు ఇచ్చింది.
కేరళలోని దక్షిణ కన్నడ జిల్లా జయనగర్‌కు చెందిన బాధితురాలిని త్రిస్సూర్‌కు చెందిన అబ్దుల్ రషీద్ ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కూతుళ్లు. రషీద్ విదేశాల్లో పని చేస్తున్నాడు. పెళ్లయ్యాక ఆమెను కూడా ఓవర్సీస్తీసుకెళ్లాడు. రెండేళ్లపాటు అక్కడే ఉంచుకున్నాడు. తర్వాత ఆమె రెండో డెలివరీ కోసం సల్లియాకు తీసుకువచ్చి వదిలిపెట్టి మళ్లీ అబ్రాడ్ వెళ్లిపోయాడు.
కొన్నాళ్ల క్రితం వారి మధ్య గొడవ జరిగింది. అయితే.. పెద్దమనుషులు సర్దిచెప్పారు. కానీ, అతను పట్టువిడవలేదు. తాజాగా, వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. దీంతో ఆమె సల్లియా పోలీసు స్టేషన్‌లో భర్త పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.