తిరువనంతపురం: వరదల వల్ల ఏర్పడ్డ నష్టం రాష్ట్ర బడ్జెట్‌ను మించిపోయిందని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. వరదల ప్రభావానికి రాష్ట్ర వ్యాప్తంగా  483 మంది మృత్యువాత పడగా, మరో 15 మంది గల్లంతయ్యారని సీఎం తెలిపారు. వరద విపత్తుపై చర్చించేందుకు కేరళ అసెంబ్లీ గురువారం ప్రత్యేకంగా సమావేశమైంది.  
 
గత వందేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయని సీఎం విజయన్ స్పష్టం చేశారు. మొత్తం 14.50 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని, ప్రస్తుతం 305 పునరావాస కేంద్రాల్లో 59వేల 296 మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. 57 వేల హెక్టార్లలో పంటలు ధ్వంసం అయ్యాయన్నారు. వరదల కారణంగా జరిగిన నష్టం రాష్ట్ర బడ్జెట్‌ కంటే ఎక్కువగా ఉంది అని సీఎం పేర్కొన్నారు. 

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తమైందని అయితే ఎప్పుడూ లేనంతగా అధిక వర్షాల వల్ల వరదలు సంభవించాయని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆగస్టు 9 నుంచి 15 వరకు 98.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సిఉండగా... ఏకంగా 352.2 మిల్లీమీటర్ల మేర కుండపోత వర్షాలు కురిశాయని సీఎం వెల్లడించారు. 

మరోవైపు మానవ తప్పిదం కారణంగానే వరదలు ముంచెత్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీషన్ ఆరోపించారు. వరదలపై ప్రభుత్వ వివరణను తప్పపట్టిన సతీషన్ అర్థరాత్రి వేళ ఉన్నపళాన అనేక డ్యామ్‌ల నుంచి వరదనీటిని వదిలారని ఆరోపించారు. డ్యామ్ ల నుంచి నీటిని వదిలిన వారిని పట్టుకోవాలని సవాల్ విసిరారు.