Kerala Boat Tragedy: ఘోర పడవ ప్రమాదం.. హౌస్ బోట్ బోల్తా, 21 మంది జలసమాధి
Kerala Boat Tragedy: కేరళలోని మలప్పురం జిల్లా తానూర్ ప్రాంతంలోని ఒట్టుంపురం సమీపంలో ఆదివారం రాత్రి ఓ హౌస్ బోట్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 21 మంది మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరిందని కేరళ మంత్రి వీ.అబ్ధుర్ రెహ్మాన్ తెలిపారు.
houseboat capsizes in Kerala's Malappuram: కేరళలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో కూడిన ఒక హౌస్ బోట్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వివరాల్లోకెళ్తే.. కేరళలోని మలప్పురం జిల్లాలో ఆదివారం పర్యాటక పడవ బోల్తా పడిన ఘటనలో 21 మంది మృతి చెందారు. బోటులో 30 మందికి పైగా ఉన్నారు. వివిధ ఆస్పత్రుల నుంచి అందిన సమాచారం ఆధారంగా 23 మంది మృతి చెందినట్లు కేరళ క్రీడా శాఖ మంత్రి వీ.అబ్ధుర్ రెహ్మాన్ ధృవీకరించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని తెలిపారు. మలప్పురం జిల్లా తానూర్ ప్రాంతంలోని తువల్తిరామ్ బీచ్ సమీపంలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బోటును ఒడ్డుకు చేర్చారు. మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కొట్టకల్ ఆస్పత్రికి తరలించారు.
బోటు పై అంతస్తులో ఉన్న వారిని ఎక్కువగా రక్షించారు. పడవలో రెండు తలుపులు మాత్రమే ఉన్నాయి. పడవలో చాలా మంది చిన్నారులు ఉండటంతో ప్రమాదం మరింత విషాదకరంగా మారింది. కింది స్థాయిలో సుమారు 25 మంది ఉన్నట్లు సమాచారం. బోటును ఒడ్డుకు చేర్చడానికి రెండున్నర గంటల సమయం పట్టింది. సెలవు దినం కావడంతో చాలా మంది బీచ్ ను సందర్శించారు. మత్స్యకారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా వెలుతురు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. క్షతగాత్రులను తిరూర్ జిల్లా ఆసుపత్రి, తిరురంగడి తాలూకా ఆసుపత్రి, పరప్పనంగడి, తానూర్ లోని ప్రయివేటు ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని కోజికోడ్, మంజేరి మెడికల్ కాలేజీలకు తరలించారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం..
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "కేరళలోని మలప్పురంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు అందిస్తామని" ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
ఉదయం 6 గంటలకు మృతదేహాలకు పోస్టుమార్టం
కేరళ బోటు ప్రమాదంలో మరణించిన 23 మందిలో 15 మందిని గుర్తించారు. ఉదయం 6 గంటల నుంచి మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభం కానుంది. బోటు మునిగిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని మంత్రి వీ.అబ్ధుర్ రెహ్మాన్ తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) ఎమ్మెల్యే పికె కున్హాలికుట్టి మాట్లాడుతూ పడవ తన సామర్థ్యానికి మించి ఎక్కువ మందిని తీసుకెళ్తోందని, ఈ కారణంగానే పడవ మునిగిపోయిందని చెప్పారు. ఈ ఘటన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సోమవారం అధికారిక సంతాప దినంగా ప్రకటన
బోటు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంతాపం తెలిపారు. విజయన్ సోమవారం సంఘటనా స్థలాన్ని సందర్శిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, సోమవారం అధికారిక సంతాప దినంగా ప్రకటించబడింది. బాధితులకు గౌరవసూచకంగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా వేయబడ్డాయి.