‘కేరళ’ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ఇందుకు సంబంధించి కేరళలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎలాంటి సవరణలు లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించారు. 

తిరువనంతపురం: రాష్ట్ర పేరును ‘కేరళ’ నుంచి ‘కేరళం’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ఇందుకు సంబంధించి కేరళలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎలాంటి సవరణలు లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించారు. రాజ్యాంగం, అన్ని అధికారిక రికార్డులలో రాష్ట్రాన్ని ‘‘కేరళం’’గా మార్చాలని ఈ తీర్మానం ద్వారా కేరళ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు తీర్మానంలో ఎలాంటి మార్పును సూచించలేదు.

‘‘మలయాళ భాషలో మన రాష్ట్రం పేరు కేరళం. 1956 నవంబర్ 1న భాష ప్రాతిపదికన రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరించబడ్డాయి. ఆ రోజును కేరళ అవతరణ దినోత్సవంగా కూడా పాటిస్తారు. మలయాళం మాతృభాషగా మాట్లాడే ప్రజల కోసం ఐక్య కేరళ డిమాండ్ స్వాతంత్ర్య పోరాట కాలం నుండి బలంగా ఉంది. అయితే రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మన రాష్ట్రం పేరు కేరళ అని రాయబడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం దానిని ‘కేరళం’గా సవరించడానికి తక్షణ చర్యలు అవసరం’’ అని తీర్మానం పేర్కొంది.

‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరును కేరళగా మార్చడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా అభ్యర్థిస్తోంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని అసెంబ్లీ అభ్యర్థిస్తోంది’’ అని ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు.

ఇక, ఆర్టికల్ 3 అనేది కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న రాష్ట్రాల ప్రాంతాలు, సరిహద్దులు లేదా పేర్ల మార్పుతో వ్యవహరిస్తుంది. వాస్తవానికి, కేరళ వాసులు ఇప్పటికే రాష్ట్రాన్ని కేరళం అని పిలుస్తున్నారు.