ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గట్టి షాక్ తగిలింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలంటే మీ తాతలు దిగిరావాలి అంటూ మోదీపై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే. 

ఫిరాయింపులపై తాతలు దిగిరావాలంటూ చేసిన వ్యాఖ్యల అనంతరం కొద్దిగంటల్లోనే బీజేపీలో చేరిపోయారు ఆప్ పార్టీ ఎమ్మెల్యే. ఆప్ ఎమ్మెల్యే అనిల్ బాజ్‌పాయ్ కేంద్రమంత్రి విజయ్ గోయల్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

అప్పటి వరకు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యాలంటే మీ తాతలు దిగిరావాలన్న కేజ్రీవాల్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బీజేపీలో చేరిపోవడంతో కంగుతిన్నారు. వెంటనే ట్విట్టర్ వేదికగా బీజేపీపై విరుచుకుపడ్డారు. 

ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే మీరు చెప్పే ప్రజాస్వామ్యానికి నిజమైన నిర్వచనమా? అంటై ప్రశ్నించారు. ఇంత మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. 

అంతకు ముందు చాలా సార్లు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారని, ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అంత సులభమేమీ కాదని కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు తమ ఎమ్మెల్యేలకు పది కోట్లు ఆఫర్ చేసి కొనుగోలు చేస్తున్నారన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను కేంద్రమంత్రి విజయ్ గోయల్ ఖండించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ఆప్ పార్టీ వ్యవహారం నచ్చకే ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారంటూ గోయల్ స్పష్టం చేశారు.