Operation Lotus: పంజాబ్‌లో ‘ఆపరేషన్ లోటస్’ ను బీజేపీ ప్రారంభించిదని ఆమ్ ఆద్మీ (ఆప్) నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌లో తమ 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందనీ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
AAP supremo Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో తమ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు. "పంజాబ్‌లో మా 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను పడగొట్టాలని చూస్తోంది" అని ఆయన అన్నారు.
ఢిల్లీలో 'ఆపరేషన్ లోటస్'ను బీజేపీ ప్రయత్నిస్తోందనీ, ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రేరేపిస్తోందని ఇటీవల కేజ్రీవాల్ ఆరోపించారు. ఇక్కడ విఫలమైన బీజేపీ.. పంజాబ్ ఆపరేషన్ లోటస్ కు తెరలేపిందని విమర్శించారు. ఢిల్లీలో విఫలమైన బీజేపీ పంజాబ్‌పై దృష్టి సారించిందని ఆప్ పేర్కొంది. "ఆపరేషన్ లోటస్" అనేది ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి.. ఎమ్మెల్యేలను కొనుగోలుకు ఉపయోగించే పదమంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. పెద్ద నేతలను కలవడానికి ఆప్ ఎమ్మెల్యేలను ఢిల్లీకి రమ్మని అడిగారనీ, పార్టీ మారేందుకు కోట్లకు కోట్లు ఆఫర్ చేశారని పంజాబ్ మంత్రి హర్పాల్ చీమా ఆరోపించారు.
"ఢిల్లీకి రండి, మీరు పెద్ద బీజేపీ నాయకులను కలుస్తారు" అని పార్టీ ఎమ్మెల్యేకు వచ్చిన కాల్‌లలో ఒకదాన్ని ఉదహరిస్తూ మిస్టర్ చీమా పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీలో చేరడానికి కొంతమంది ఢిల్లీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు ఆఫర్ చేసిందని ఆప్ ఆరోపించింది. "బీజేపీ ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఇస్తోంది. కర్ణాటకలో ఆపరేషన్ లోటస్ విజయం సాధించి ఉండవచ్చు.. కానీ ఢిల్లీ ఎమ్మెల్యేలు గట్టిగా ఉండటంతో.. బీజేపీ ఆపరేషన్‌లో విఫలమయ్యారు" అని చీమా మీడియా సమావేశంలో అన్నారు.
"పంజాబ్‌లో ప్రభుత్వం మారితే, మీకు (ఎమ్మెల్యేలు) పెద్ద పదోన్నతులు, పదవులు ఇవ్వబడతాయి" అని చెప్పినట్టు చీమా అన్నారు. భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టమని ఎమ్మెల్యేలకు చాలా కాల్స్ వచ్చాయని తెలిపారు. అయితే, ఆప్ చేస్తున్న మోపుతున్న ఈ అభియోగాలను బీజేపీ తోసిపుచ్చింది. "రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీపై పంజాబ్ మంత్రి హర్పాల్ చీమా చేసిన నిరాధారమైన ఆరోపణ పంజాబ్‌లో ఆప్ పెద్ద చీలికకు దారితీస్తోందని చూపిస్తుంది. కేజ్రీవాల్ జోక్యంతో పార్టీ చీలిపోయే అంచున ఉంది" అని బీజేపీ నాయకుడు సుభాష్ శర్మ అన్నారు.
అంతకుముందు రోజు మంగళవారం నాడు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్‌లోని అన్ని స్థానాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ తన రెండు రోజుల రాష్ట్ర పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో ఆప్ జీతాలు చెల్లించడం లేదని, బదులుగా గుజరాత్‌లో ప్రచారానికి డబ్బును వినియోగిస్తోందని కాంగ్రెస్ ఆరోపణలపై మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ స్పందిస్తూ, “కాంగ్రెస్ ఖతం హో గయీ హై (కాంగ్రెస్ అయిపోయింది). మీరు వారి ప్రశ్నలను తీసుకోవడం మానేయాలి. ప్రజల మనస్సులో అలాంటి ప్రశ్నలు లేవు” అని అన్నారు.
