కేజ్రీవాల్ అరెస్ట్.. 31న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి నిరసన
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ప్రతిపక్ష ఇండియా కూటమి ఖండించింది. ఈ అరెస్టును నిరసిస్తూ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మార్చి 31వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్టును నిరసిస్తూ ప్రతిపక్షాల ఇండియా కూటమి మార్చి 31న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో 'మహా ర్యాలీ' నిర్వహించనుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆదివారం తెలిపారు. ప్రతిపక్షాల ఐక్యత, బలప్రదర్శనే లక్ష్యంగా ఈ నిరసన ఉండనుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా మార్చి 31న ఉదయం 10 గంటలకు జరిగే ర్యాలీలో పాల్గొనాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ అరెస్టుపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై విరుచుకుపడిన ఆయన, ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన తీరు, రాజ్యాంగాన్ని ప్రేమించే, గౌరవించే దేశ ప్రజలందరి హృదయాల్లో ఆగ్రహావేశాలు తెప్పించాయని ఆయన అన్నారు. ‘‘కేవలం అరవింద్ కేజ్రీవాల్ గురించే కాదు. మొత్తం ప్రతిపక్షాన్ని ఒక్కొక్కటిగా తుడిచిపెట్టేస్తున్నారు, ప్రధాని మోడీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. బీజేపీలో చేరాలని బెదిరిస్తున్నారు. అమ్మడానికి సిద్ధంగా లేని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు’’ అని ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన మీడియా సమావేశంలో గోపాల్ రాయ్ అన్నారు.
‘‘ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని బలోపేతం చేయడానికి, విస్తరించడానికి, మార్చి 31, ఆదివారం ఉదయం 10 గంటలకు, ఢిల్లీ మొత్తం రామ్ లీలా మైదానంలో సమావేశమవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ఇది బీజేపీ కూటమి మహా ర్యాలీ... ఢిల్లీ ప్రజలే కాదు, భారత ప్రజలందరూ, ఈ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారు మార్చి 31 ఉదయం 10 గంటలకు రామ్ లీలా మైదానానికి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.