KCR-Uddhav-Pawar meet: కేసీఆర్-ఉద్ధవ్ థాక్రే-శరద్ పవార్ ల భేటీపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర పఢ్నవీస్ స్పందించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా కలవడం కొత్తేమీ కాదనీ, 2014-2019 మధ్య మహారాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు కూడా తనను కేసీఆర్ కలిశారని ఆయన అన్నారు.
KCR-Uddhav-Pawar meet: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లను ముంబయిలో కలిసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశలపై బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ స్పందించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా కలవడం కొత్తేమీ కాదని, 2014-2019 మధ్య మహారాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు కూడా తనను కేసీఆర్ కలిశారని ఆయన అన్నారు. గతంలోనూ ఇలాంటి కూటమి ప్రయోగాలు జరిగాయనీ, అయితే, అవన్నీ ఫెయిల్ అయ్యాయని పేర్కొన్నారు. ఔరంగాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
“ఇంతకుముందు కూడా, ఈ నాయకులు 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ( బీజేపీని ఎదుర్కోవడానికి) కలిసి వచ్చారు. అయితే, దాని నుండి ఏమీ బయటపడలేదు. ఇలాంటి ప్రయోగాలు (బీజేపీచేతర పార్టీల కూటమి) గతంలో అనేక రాష్ట్రాల్లో జరిగాయి, కానీ ఎటువంటి ప్రభావం చూపలేదు” అని ఫడ్నవీస్ అన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న తెలంగాణలో త్వరలో తమ పార్టీ అగ్రగామిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. “2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. రాబోయే కాలంలో ఆ రాష్ట్రంలో మా పార్టీ నంబర్‌వన్‌గా నిలుస్తుంది’’ అని ఫడ్నవీస్ అన్నారు.
ఇదిలావుండగా, దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యేక ఫ్రంట్ ఏర్పాటు దిశగా రాజకీయాలు కదులుతున్నాయి. దీని కోసం ఇప్పటికే కాంగ్రెస్ ను కాదని మరో ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసే దిశగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం బీజేపీకి వ్యతిరేకంగా ఇతర రాజకీయ పార్టీలను ఏకం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే దేశంలోని బీజేపీయేతర పలువురు ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. ఇదే విషయంపై చర్చించారు. ఈ క్రమంలోనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌పై చర్చించడానికి ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో సమావేశమైన పలు విషయాలపై చర్చించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై వ్యతిరేకతను బలోపేతం చేసే ప్రచారంలో భాగంగానే ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించామని తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లో అందరం కలిసి .. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు.
ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో సీఎం కేసీఆర్.. పలువురు నేతలతో కలిసి సమావేశమైన సంగతి తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు కాబోయే ప్రతిపక్ష ఫ్రంట్ గురించి చర్చ జరిగిన ఒక రోజు తర్వాత శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సోమవారం నాడు సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిపి అధికారాన్ని పంచుకుంటున్న శివసేన.. బీజేపీని ఎదుర్కొవడానికి ప్రత్యేక ఫ్రంట్ గురించి గతేడాది తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడారని తెలిపారు. కాంగ్రెస్ లేకుండా రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు గురించి టీఎంసీ మాట్లాడితే.. కాంగ్రెస్ ను కలిసే ముందుకు సాగాలని సూచించామని తెలిపారు. "కాంగ్రెస్ లేకుండా రాజకీయ ఫ్రంట్ ఏర్పడుతుందని మేము ఎప్పుడూ చెప్పలేదు. మమతా బెనర్జీ రాజకీయ ఫ్రంట్‌ను సూచించిన సమయంలో, కాంగ్రెస్‌ను వెంట తీసుకెళ్లాలని మాట్లాడిన మొదటి రాజకీయ పార్టీ శివసేన" అని సంజయ్ రౌత్ అన్నారు.
