సన్ స్ట్రోక్: చంద్రులిద్దరూ లోకసభకూ పోటీ?

KCR, Chandrababu Naidu may contest both state and Lok Sabha polls
Highlights

కుమారులను తమ వారసులుగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా కేసిఆర్, చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో లోకసభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. తాము పోటీ చేయడానికి తగిన లోకసభ స్థానాలను కూడా వారు ఎంపిక చేసుకున్నారు.

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడు లోకసభకు కూడా పోటీ చేసే అవకాశాలున్నాయి. శాసనసభకే కాకుండా లోకసభకు కూడా వారు పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. 

కేసిఆర్ తో పాటు చంద్రబాబు కూడా తమ తనయులు తమ వారసులుగా నిలబెట్టే క్రమంలో ముఖ్యమంత్రులను చేయాలనే లక్ష్యంతో ఉన్నారని, అందువల్లనే లోకసభకు కూడా పోటీ చేయాలని అనుకుంటున్నారని చెబుతున్నారు 

జాతీయ రాజకీయాలకు వెళ్లడం ద్వారా చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్ కు, కేసిఆర్ తన తనయుడు కేటీఆర్ కు రాష్ట్ర రాజకీయాలను అప్పగిస్తారని అంటున్నారు. 

నారా లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు టీజీ వెంకటేష్, జెసి దివాకర్ రెడ్డి బహిరంగంగానే చంద్రబాబును కోరుతున్నారు. కేటీఆర్ ను తన వారసుడిగా నిలబెట్టడానికి కేసిఆర్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ గజ్వెల్ నుంచి శాసనసభకు, మెదక్ నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు విజయవాడ లోకసభ సీటుకు పోటీ చేస్తారని, అసెంబ్లీకి విజయవాడ లోకసభ సీటు పరిధిలోని నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తారని అంటున్నారు. 

మరోవైపు, కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో బిజెపికి అధికారాన్ని చేపట్టడానికి అవసమైనన్ని సీట్లు రావాలని, ఈ స్థితిలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించే పరిస్థితి వస్తుందని కేసిఆర్ తో పాటు చంద్రబాబు కూడా భావిస్తున్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి అవసరమైన రాజకీయాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇప్పటి నుంచే పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.

loader