కేరళలో ఓ పాతికేళ్ల కథాకళి కళాకారుడు ప్రదర్శన సమయంలో కుప్పకూలి మృతి చెందారు. 25 ఏళ్ల రఘునాథ్ మహిపాల్ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. 

కేరళ : ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే హఠాత్తుగా కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పాతిక, ముప్పై...కొన్నిసార్లు పది, పన్నెండేళ్ల పిల్లలు కూడా ఇలాంటి మరణాల బారిన పడుతున్నారు. ఈ కోవలోనే కేరళలో తాజాగా ఓ పాతికేళ్ల కథాకళి కళాకారుడు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. 

కేరళ అలప్పుజలోని చెర్తలలోని ఒక ఆలయంలో స్టేజ్ ప్రదర్శన సందర్భంగా 25 ఏళ్ల కథాకళి కళాకారుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఆదివారం (ఆగస్టు 6) రాత్రి మరణించాడు. రఘునాథ్ మహిపాల్ అనే కథాకళి డ్యాన్సర్ మరుథోర్వట్టం ధన్వంతరి ఆలయంలో ఓ నృత్య నాటకం ప్రదర్శిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రదర్శన చేస్తున్నప్పుడు, అతనికి తీవ్ర అసౌకర్యంగా అనిపించింది. ఆ తరువాత అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 

ఇన్ స్టా లో పరిచయం, ప్రేమ.. పెళ్లి డబ్బులకోసం కిడ్నాప్ డ్రామా ఆడి... తండ్రికి ఓ కూతురు వీడియో బెదిరింపు...

వెంటనే ఇది గమనించిన వారు మహిపాల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ అతని ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మహిపాల్ గుండెపోటుతో మృతి చెందాడు. 'గురుదక్షిణ' అనే నృత్య నాటకంలో రఘునాథ్ మహిపాల్ వాసుదేవుని పాత్రను పోషిస్తున్నాడు.

ఎర్నాకులంలోని కంజిరమట్టాంకు చెందిన మహిపాల్ త్రిప్పునితురలోని ఆర్‌ఎల్‌వి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌లో ఎంఏ కథాకళి ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 2018లో, కథాకళి మాస్ట్రో, పద్మభూషణ్ గ్రహీత, మడవూర్ వాసుదేవన్ నాయర్ కొల్లంలో ఒక స్టేజ్ ప్రదర్శనలో కుప్పకూలిపోయి మరణించారు. ఆయన చనిపోయిన.. అదే పద్ధతిలో మహిపాల్ మరణించారు. 

మడవూర్ వాసుదేవన్ నాయర్ చనిపోయే సమయంలో అగస్త్యకూడ్ మహాదేవ ఆలయంలో 'రామాయణం' ఇతిహాసంలోని రావణ పాత్రను ప్రదర్శిస్తున్నాడు. ఒక్కసారిగా అసౌకర్యంగా అనిపించి వేదికపై కుప్పకూలిపోయాడు. మడవూర్ వాసుదేవన్ నాయర్ 1997లో సంగీత నాటక అకాడమీ అవార్డును, కేరళ కళామండలం అవార్డును కూడా అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలిచ్చారు.