జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన ఓ వ్యక్తిని కాల్చిచంపారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన ఓ వ్యక్తిని కాల్చిచంపారు. జిల్లాలోని అచన్ ప్రాంతంలో సాయుధ గార్డుగా పనిచేస్తున్న సంజయ్ శర్మ అనే వ్యక్తిపై ఉగ్రవాదులు ఆదివారం ఉదయం కాల్పులు జరిపారు. అయితే వెంటనే సంజయ్ శర్మను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంజయ్ శర్మ మృతి చెందాడు. ఈ విషయాన్ని జమ్మూ కశ్మీర్ పోలీసులు ధ్రువీకరించారు. 

అచన్ పుల్వామాకు చెందిన సంజయ్ శర్మ అనే మైనారిటీకి చెందిన ఒక పౌరుడిపై స్థానిక మార్కెట్‌కు వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతంలో బలగాలను మోహరించినట్టుగా చెప్పారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని.. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు.

Scroll to load tweet…

ఈ ఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. సంజయ్ పండిత్ మరణవార్త విని చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. “సంజయ్ బ్యాంక్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈరోజు తెల్లవారుజామున ఉగ్రవాదుల దాడిలో చనిపోయాడు. ఈ దాడిని నేను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను. అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.