కశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల అజిజ్ విలక్షణ కళాకారుడిగా ప్రశంసలు పొందుతున్నారు. ఎముకలను కళాఖండాలుగా తీర్చుదిద్దుతున్న ఆయనకు లోయలో మంచి గుర్తింపు వచ్చింది.  

న్యూఢిల్లీ: రంజాన్ వచ్చిందంటే.. చాలా చోట్ల ఘుమఘమలాడే వంటకాల స్టాళ్లు ఏర్పడుతాయి. మతం, ప్రాంతాలకు అతీతంగా చాలా మంది హలీం, హరీస్ తింటూ ఆస్వాదిస్తారు. కానీ, ఈ కశ్మీరీకి హరీస్ వంట.. తనలో దాగి ఉన్న ఓ కళను తట్టి లేపింది. లాక్‌డౌన్ కాలంలో తల్లి ఇంట్లో హరీస్ వంట చేస్తూ ఉంటే ఆ వంటకాన్ని చూస్తూ అజిజ్ ఉర్ రెహ్మాన్ మైండ్‌లో ఓ ఐడియా తళుక్కున మెరిసింది. అదే ఆయనను కశ్మీర్‌కు చెందిన ఒక విభిన్న కళాకారుడిగా నిలబెట్టింది.

శ్రీనగర్‌లోని గులాబాగ్ ఏరియాకు చెందిన 22 ఏళ్ల అజీజ్ ఉర్ రెహ్మాన్ బోన్ ఆర్టిస్టుగా ప్రశంసలు అందుకుంటున్నారు. పశువుల బొక్కలతో ఆయన కళాఖండాలు సృష్టిస్తున్నారు. కశ్మీర్ లోయలో ఆయన ఒక విలక్షణ కళాకారుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు.

‘మా అమ్మ హరీసా వండుతూ ఉంటే చూసేవాడిని. మాంసాన్ని బాగా ఉడికించేది. ఎముకల నుంచి మాసం వేరయిపోయేదాకా ఉడికిస్తూనే ఉండేది. ఆ తర్వాత ఎముకలను బయటకు తీసేసేది’ అని అజిజ్ చెప్పారు. అలా తన తల్లి బయటకు తీసేసిన ఎముకల్లో నుంచి పెద్ద బొక్కను తీసుకున్నారు. ఒక కత్తితో దాన్ని చెక్కడం ప్రారంభించారు. తాను ఆ బొక్కను ఓ పెండాంట్ కత్తిగా మలిచాను అని వివరించారు. దాని ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా చాలా మంది ప్రశంసించారని చెప్పారు.

కశ్మీర్‌లోని షేర్ ఈ కావ్మీర్ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ సైన్సెస్ చదువుతున్న అజిజ్ బోన్ క్రాఫ్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు. తాను ఈ ఎముకలతో నగలు, కీ చైన్లు, కత్తులు, ఇతర అలంకార వస్తువులను తయారు చేస్తారని అజిజ్ చెప్పారు. ఈ కళతోనే తాను తన జీవికకు డబ్బులు సంపాదిస్తున్నానని వివరించారు.

Also Read: 

కొవిడ్ సమయంలో చాలా సమయం తన వద్ద ఉండేదని, ఆ సమయంలోనే ఈ కళను ఒంటబట్టించుకున్నట్టు అజిజ్ వివరించారు. చిన్నప్పటి నుంచి సృజనాత్మక విషయాలపై తనకు ఆసక్తి అని వివరించారు. ఒక్కసారి తాను చెక్కిన పీస్‌లు రెడీ కాగానే వాటిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసేవాడినని, అక్కడ చాలా మంది వాటి ప్రత్యేకతను తెలుసుకుని కొనుగోలు చేసేవారని పేర్కొన్నారు. 

ముందు తన తల్లిదండ్రులు ఆ పనిని వ్యతిరేకించారని, సమయం వృథా చేస్తున్నానని భావించేవారని అజిజ్ వివరించారు. కానీ, ఇప్పుడు వారు తనకు అండగా నిలిచారని చెప్పారు. తాను పనిలో నిమగ్నం కావడం వల్ల చెడు తిరుగుళ్లు, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉంటున్నాననీ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారని చెప్పారు.

కశ్మీర్ ఆర్ట్ ఎంపోరియంలో రెండు రోజుల ఎగ్జిబిషన్‌కు అజిజ్‌కు అవకాశం లభించిందని, ప్రజలు తన పనిని మెచ్చుకున్నారని వివరించారు. హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ డైరెక్టర్ మొహమూద్ అహ్మద్ షా సహా పలువురు ప్రముఖులు ఆయనను ప్రశంసించారు.

కశ్మీర్ లోయలో నాన్ వెజ్ ఎక్కువ తింటారని, కాబట్టి, ఎముకలు చాలా సులభం అని అజిజ్ వివరించారు. తన తల్లిదండ్రుల నుంచి ఇప్పుడు మద్దతు లభిస్తున్నందున సంతోషిస్తున్నట్టు చెప్పారు. యువత కూడా ఇలా తమకు ఇష్టమైన ప్రవృత్తిని ఎంచుకుని సక్సెస్ కావాలని కోరారు.

--- బసిత్ జర్గార్