Asianet News TeluguAsianet News Telugu

పళని ప్రభుత్వానికి చుక్కెదురు..మెరీనా స్క్వేర్ లోనే కరుణానిధి అంత్యక్రియలు

చెన్నైలోని మెరీనా బీచ్ లోనే నిర్వహించాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.హైకోర్టు తీర్పుతో.. పళని స్వామి ప్రభుత్వానికి చుక్కెదురైంది.

Karunanidhi To Have Burial Site At Marina Beach, Says Court

పలు నాటకీయ పరిణామాల అనంతరం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థివదేహానికి అంత్యక్రియలు జరిపే స్థలంపై ఏర్పడిన వివాదంపై ఎట్టకేలకు మద్రాసు హైకోర్టు తీర్పు వెలువరించింది.  కరుణానిధి అంత్యక్రియలు.. చెన్నైలోని మెరీనా బీచ్ లోనే నిర్వహించాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.హైకోర్టు తీర్పుతో.. పళని స్వామి ప్రభుత్వానికి చుక్కెదురైంది.

కరుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి పక్కన నిర్వహించేందుకు స్థలం కేటాయించాలని డీఎంకే చేసిన విజ్ఞప్తిని తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీనిపై డీఎంకే నిన్న రాత్రి హైకోర్టును ఆశ్రయించింది. ఈ అత్యవసర వ్యాజ్యంపై హైకోర్టు అర్థరాత్రి విచారణ చేపట్టింది. ఈరోజు ఉదయం 8 గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.


దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రులుగా ఉండి కన్నుమూసిన వారికి మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించిన దాఖలాలు గతంలో లేవని పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ నాడార్‌ చనిపోయినప్పుడు డీఎంకే అధికారంలో ఉందని.. ఆయనకు అంతిమ సంస్కారాలకు మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించలేదని గుర్తుచేసింది. అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలిత ముఖ్యమంత్రులుగా కన్నమూసినందునే వారికి మెరీనా బీచ్‌లో దహన సంస్కారాలకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని హైకోర్టుకు తెలిపింది. కరుణానిధికి స్థలం కేటాయించడానికి తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగానే కరుణానిధి అంతిమ సంస్కారాలకు గిండిలో 2ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించింది.


మరోవైపు మెరీనా బీచ్‌లో అంతిమ సంస్కారాలు జరపకుండా నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు. డీఎంకే అత్యవసర వ్యాజ్యంపై హైకోర్టు విచారించిన సందర్భంగా పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. ఆయా పిటిషన్లను కొనసాగిస్తారా? లేక ఉపసంహరించుకుంటారా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఐదుగురు పిటిషనర్లు తమ వ్యాజ్యాలను వెనక్కి తీసుకుంటామని చెప్పారు.

చివరకు కరుణానిధి అంత్యక్రియలను మెరీనా స్క్వేర్ లోనే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుకి ప్రభుత్వం షాకవ్వగా.. డీఎంకే నేతలు మాత్రం ఆనందం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుతో ఆనందంతో పలువురు నేతలు కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios