మిమ్మల్ని నాన్నా అని పిలవనా... తండ్రిపై స్టాలిన్‌ భావోద్వేగంతో కవిత

Karunanidhi son Stalin pens poem for his father
Highlights

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఇక లేరన్న వార్త విని తమిళులు కన్నీరుమున్నీరవుతున్నారు. కరుణ అభిమానులు, డీఎంకే కార్యకర్తలు కలైంజర్‌ను తలుచుకుని రోదిస్తున్నారు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఇక లేరన్న వార్త విని తమిళులు కన్నీరుమున్నీరవుతున్నారు. కరుణ అభిమానులు, డీఎంకే కార్యకర్తలు కలైంజర్‌ను తలుచుకుని రోదిస్తున్నారు. ఇక కరుణానిధి కుటుంబసభ్యుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరిలోకి ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగే కొడుకు స్టాలిన్‌ను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఈ నేపథ్యంలో తన తండ్రిని తలచుకుంటూ భావోద్వేగంతో ఓ లేఖ రాశారు స్టాలిన్.

 ‘‘విరామం లేకుండా పని చేసిన వ్యక్తి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు’’ ఈ మాట నాకు మూడు దశాబ్ధాల కింద చెప్పారు..  మనం చనిపోయినప్పుడు నలుగురూ మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలని మీరు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు.. మీరు ఎక్కడికి వెళ్లినా నాకు చెప్పకుండా వెళ్లేవారు కాదు.. కానీ ఈసారి ఎందుకు చెప్పకుండా వెళ్లిపోయారు...? తమిళ రాష్ట్ర సంక్షేమం కోసం మీరు చేసిన సేవ పూర్తైందనుకుని వెళ్లిపోయారా అప్పా..?

80 ఏళ్లుగా మీరు తమిళనాడు కోసం చేసిన సేవలు, సాధించిన రికార్డులు ఇంకెవరైనా సాధించగలరా..? అని తెలుసుకోవడానికి ఎక్కడైనా దాక్కున్నారా..? ఒక్కసారి నా ప్రియమైన సోదరులారా.. అని మమ్మల్ని పిలవండి. ఆ పలుకే మరో వందేళ్ల వరకు కలిసి పోరాడేందుకు మాకు శక్తినిస్తాయి. జూన్ 3న మీ పుట్టినరోజు.. మీకున్న నైపుణ్యంలో సగం వంతు నాకు ఇవ్వండని ఒకసారి మిమ్మల్ని వేడుకున్నాను..

ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను... మీ గురువు అన్నాదురై వెళ్లిపోతూ ఆయన హృదయాన్ని మీకు ఇచ్చినట్లు.. మీ హృదయాన్ని నాకు ఇస్తారా..? ఎందుకంటే మీరు కన్న కలలు మేం పూర్తిచేస్తాం.. ఇంతకాలం మిమ్మల్ని నాన్న అని కాకుండా థలైవరే (మై లీడర్) అనే ఎక్కువసార్లు పిలిచా.. చివరిసారిగా మిమ్మల్ని అప్పా అని పిలవచ్చా థలైవరే.. అశ్రునయనాలతో మీ స్టాలిన్. అని లేఖలో పేర్కొన్నారు.

loader