Tamil Nadu: అందుకే విజయ్‌కి సపోర్ట్ చేశాం.. తొలిసారి ఓపెన్ అయిన స్టాలిన్
Tamil Nadu: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి, ఎమ్‌కే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీవీఎస్ ప్రభుత్వానికి తమ మిత్రపక్షాలు మద్ధతు ఇవ్వడాన్ని తాను అడ్డుకోలేదని స్పష్టం చేశారు.

రాష్ట్రపతి పాలనను నివారించడమే లక్ష్యమన్న డీఎంకే అధినేత
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉండేదని అన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా చూడాలనే ఉద్దేశంతోనే తమ కూటమి భాగస్వామ్య పార్టీలు టీవీకేకు మద్ధతు ఇవ్వడానికి అనుమతించినట్లు వెల్లడించారు. తమిళనాడులో ఎన్నికల తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో గవర్నర్ జోక్యం లేదా కేంద్ర ప్రభావం పెరగకుండా చూడడం కూడా తమ ఆలోచనలో భాగమని ఆయన వ్యాఖ్యానించారు.
మెజారిటీకి దూరమైన టీవీకే.. మిత్రపక్షాల మద్ధతుతో ప్రభుత్వం
2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని సాధించలేకపోయింది. దీంతో పలు రాజకీయ పార్టీల సపోర్ట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. స్టాలిన్ ప్రకారం, టీవీకేకు సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీలు ముందుగా తనతో చర్చించాయని చెప్పారు. అయితే వాటిని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని భావించి స్వేచ్ఛనిచ్చినట్లు వెల్లడించారు.
ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేస్తాం
ప్రస్తుత ప్రభుత్వం కొనసాగడంలో కొన్ని మిత్రపక్షాల పాత్ర కీలకమని స్టాలిన్ పేర్కొన్నారు. గతంలో డీఎంకేతో కలిసి పనిచేసిన పార్టీలు తమ రాజకీయ నిర్ణయాల ప్రకారం వ్యవహరించాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డీఎంకే కార్యకర్తలను నిరుత్సాహపరచలేదని, అధికారంలో లేకపోయినా ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలే తమ రాజకీయ లక్ష్యమని, ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహిస్తామని స్టాలిన్ తెలిపారు.

