హిందీ వ్యతిరేక ఉద్యమంతోపాటు ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలిచిన ద్రవిడ ఉద్యమ నేతల్లో కరుణానిధి ఒకరు. కళ్లకూడి ప్రాంతంలో ఉత్తరాది ‘సిమెంట్’ మొఘల్ దాల్మియ ఒక సిమెంట్ పరిశ్రమ స్థాపించినందుకు ఈ ప్రాంతానికి ఆయన పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయమే కరుణానిధి తమిళ రాజకీయాల్లో తారాజువ్వలా దూసుకెళ్లడానికి కారణమైందని చెబుతారు. 1953లో కళ్లకూడికి దాల్మియపురం అని పేరు పెట్టడానికి వ్యతిరేకంగా స్థానికుల్లో వేడి రగిల్చారు కరుణానిధి. ముందు ఉండి ఉద్యమానికి సారథ్యం వహించారు. 

మళ్లీ ‘దాల్మియపురం’ పారిశ్రామిక పట్టణానికి ‘కళ్లకూడి’గా పేరు పెట్టాలన్న ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌కు దాల్మియపురం అని పెట్టిన పేరును చెరిపేసి.. రైలు పట్టాలపై బైఠాయించారు కరుణానిధి ఆయన సహచరులు. చట్టవిరుద్ధంగా ఆందోళనకు దిగినందుకు ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. ఈ ఉద్యమంలో ఇద్దరు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు.