చెన్నై: వెన్నునొప్పి కారణంగా శస్త్రచికిత్స జరిగిన సమయంలో ఆసుపత్రి నుండే  కరుణానిధి పాలనను సాగించారు. విపక్షాలు విమర్శలకు కూడ ఆయన ఆసుపత్రి నుండే సమాధానం ఇచ్చారు.  ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండానే  ప్రజలకు అవసరమైన పాలనను అందించడంలో  కరుణానిధి  తీవ్రంగా శ్రమించారని డీఎంకె వర్గాలు గుర్తు చేసుకొంటాయి.

2009 జనవరి 25 వ తేదీన వెన్ను నొప్పి కారణంగా కరుణానిధి ఆసుపత్రిలో చేరారు.  ఆయనను పరీక్షించిన వైద్యులు వెన్నుకు శస్త్రచికిత్స చేశారు. ఈ శస్త్రచికిత్స కారణంగా కరుణానిధి కొన్ని రోజుల పాటు  ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. గణతంత్ర దినోత్సవానికి ఒక్క రోజు ముందే ఆయన ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

దీంతో  గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కరుణానిధి పాల్గొనే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కరుణానిధి జనవరి 26 వతేదీ తెల్లవారుజామున  అప్పటి ఆర్థిక శాఖమంత్రి  అన్బళగన్‌ను  ఆసుపత్రికి పిలిపించుకొన్నారు. గణతంత్ర వేడుకల్లో తనకు బదులుగా ఆర్థిక శాఖ మంత్రి పాల్గొనేలా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. 

కరుణానిధి ఆసుపత్రిలో చేరడంతో అప్పటి విపక్షనాయకురాలు అన్నాడీఎంకె అధినేత్రి జయలలిత పలు ప్రశ్నలను సంధించారు.  ఈ ప్రశ్నలకు  సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.  అయితే ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటూనే కరుణానిధి జయలలిత విసిరిన ప్రశ్నలకు తానే స్వయంగా సమాధానమిచ్చారు. 

శ్రీలంక తమిళుల ఊచకోతకు నిరసనగా 31న చెన్నైలో తూత్తుకుడి యువకుడు ముత్తుకుమార్‌ ఆత్మాహుతికి పాల్పడటంతో పార్టీ ప్రధాన కార్యదర్శిని సంప్రదించి బలవన్మరణాలను ప్రోత్సహించకూడదంటూ ఓ ప్రకటన విడుదల చేయించారు. అలాగే ముత్తుకుమార్‌ కుటుంబానికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్టు శాసనసభ లో స స్టాలిన్‌ ప్రకటించారు. స్టాలిన్ ప్రకటన చేయడం వెనుక కరుణానిధి కీలకంగా ఉన్నారు.

1969 నుండి ప్రతి ఏటా ఫిబ్రవరి 3వ తేదీన అన్నాదురై సమాధి వద్ద నివాళులర్పించడం సంప్రదాయం. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ  ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కరుణానిధి భావించారు. అంతేకాదు అదే రోజు పార్టీ కార్యవర్గ సమావేశం, కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని కూడ ప్లాన్ చేసుకొన్నారు. కరుణానిధి నిర్ణయాన్ని వైద్యులు కూడ అడ్డుచెప్పలేదు.

శ్రీలంకలో  ఆ దేశ తమిళుల ఊచకోత విషయమై చర్చించేందుకు ఆసుపత్రిలోనే తమిళనేతలతో ఫిబ్రవరి 2వ తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత కరుణానిధి స్వయంగా  ఈ అభిప్రాయాల ఆధారంగా పార్టీ  చేపట్టాల్సిన తీర్మానాలను కరుణానిధి స్వయంగా రాసుకొన్నారు. 

2009 ఫిబ్రవరి 3వ తేదీన అంబులెన్స్ లో అన్నాదురై సమాధి వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో  పాల్గొన్నారు. బడ్జెట్‌లో మార్పులు చేర్పులపై సూచనలు చేశారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశంలో పాల్గొన్నారు 

2009 ఫిబ్రవరి 4 వతేదీన  శ్రీలంక తమిళుల సమస్య పరిష్కారానికి మాజీ న్యాయమూర్తులతో కూడిన ఓ కమిటీని కరుణానిధి ప్రకటించారు. శ్రీలంకలో తమిళుల సమస్య పరిష్కారం కోసం  ఏం చేస్తే బాగుంటుందనే విషయమై  పత్రికలో పెద్ద వ్యాసం రాశారు. పార్టీ, ప్రభుత్వం విషయాలను చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చిస్తూనే ఆసుపత్రిలో వైద్యులు చేస్తున్న చికిత్సకు ఆయన సహకరించారు.

ఆసుపత్రి నుండే పాలన సాగించినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు తెలుసుకొంటూనే వాటిపై  తగిన నిర్ణయాన్ని ఆసుపత్రి నుండే అమలు చేసేవారు కరుణానిధి.