తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయారన్న వార్త విని.. కొందరు కార్యకర్తల గుండెలు ఆగిపోయాయి. మరికొందరు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే..  అసలు ఆయన చనిపోయిన వార్త తన రెండో భార్య దయాళు అమ్మాళ్ కు తెలియదట.

2016 నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కళ్ల ముందు ఏం జరుగుతుందో గ్రహించలేని స్థితిలో ఉన్న ఆమెకు, జ్ఞాపకశక్తి కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. కరుణ ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో.. మూడు రోజుల క్రితం పెద్ద కుమారుడు అళగిరి ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చి కరుణ వద్ద కొంతసేపు వుంచి ఇంటికి తీసుకెళ్లారు. 

మంగళవారం సాయంత్రం గోపాలపురంలోని ఇంటికి కరుణ పార్థివదేహాన్ని తీసుకొచ్చినప్పుడు ఆమె ఇంట్లోనే ఉన్నప్పటికీ.. ఏం జరిగిందో గ్రహించే స్థితిలో లేరు. అందుకే.. మెరీనాబీచ్‌లో జరిగిన కరుణ అంత్యక్రియలకు దయాళు అమ్మాళ్‌ను తీసుకురాలేదు.