ఇక సెలవ్.. శాశ్వత నిద్రలోకి కరుణానిధి

karunanidhi burial completed
Highlights

రాజకీయ కురువృద్ధుడు, సినీ, సాహిత్య రంగాల్లో ధ్రువతార, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. చెన్నై మెరీనా బీచ్‌లో అశేష జనవాహిన అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి

రాజకీయ కురువృద్ధుడు, సినీ, సాహిత్య రంగాల్లో ధ్రువతార, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. చెన్నై మెరీనా బీచ్‌లో అశేష జనవాహిన అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి. గురువు, మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత అన్నాదురై సమాధి వెనుక భాగంలో కరుణానిధిని ఖననం చేశారు. 

అభిమానుల కన్నీటి వీడ్కోలు:
రాజాజీహాలు నుంచి ఆయన పార్థీవదేహాన్ని పూలతో అలంకరించిన సైనిక వాహనంలోకి చేర్చారు. అనంతం త్రివిధ దళాలకు చెందిన సైనిక సిబ్బంది వెంటరాగా.. ఆయన అంతిమయాత్ర బయలుదేరింది. రాజాజీహాలు నుంచి వాలాజారోడ్, చెపాక్ స్టేడియం మీదుగా కరుణానిధి అంతిమయాత్ర సాగింది..

తమ అభిమాన నేతకు కడసారి వీడ్కోలు తెలిపేందుకు డీఎంకే కార్యకర్తలు, ప్రజలు దారిపొడవునా బారులు తీరారు. కలైంజర్..కలైంజర్ అంటూ నినాదాలు చేస్తూ... కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన డీఎంకే కార్యకర్తలు, కరుణానిధి అభిమానులతో చెన్నై రహదారులు ఇసుకేస్తే రాలనట్టుగా మారిపోయాయి.

అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు:
కరుణానిధి అంతిమయాత్రకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, గులాంనబీ అజాద్‌, తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్సీపీ నేత శరద్‌పవార్‌, వివిధ పార్టీల నేతలు మెరీనాబీచ్‌కు చేరుకున్నారు. అనంతరం కరుణానిధి పార్థీవదేహానికి నేతలు నివాళులర్పించారు. 

త్రివిధ దళాల గౌరవ వందనం:
మెరీనాబీచ్‌కు చేరుకున్న కరుణానిధి భౌతికకాయాన్ని త్రివిధ దళాలకు చెందిన సైనికులు మోసుకుంటూ అంత్యక్రియత వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఆయన పార్థీవదేహంపై జాతీయజెండాను వుంచి గౌరవ వందనం చేశారు.. కరుణానిధికి గౌరవ సూచికంగా గాలిలోకి కాల్పులు జరిపారు.

loader