అవమానానికి జయ ప్రతీకారం.. కట్టుబట్టలతో వీల్‌ఛైర్ నుంచే కరుణ అరెస్ట్

karunanidhi arrest
Highlights

60 ఏళ్ల పాటు తమిళ రాజకీయాలను శాసించిన కరుణానిధికి అసలుసిసలు పోటీనిచ్చారు దివంగత ముఖ్యమంత్రి జయలలిత. తుదిశ్వాస విడిచే వరకు ఈ ఇద్దరు దిగ్గజాలు కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. 

60 ఏళ్ల పాటు తమిళ రాజకీయాలను శాసించిన కరుణానిధికి అసలుసిసలు పోటీనిచ్చారు దివంగత ముఖ్యమంత్రి జయలలిత. తుదిశ్వాస విడిచే వరకు ఈ ఇద్దరు దిగ్గజాలు కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. బతికినంతకాలం పగ, ప్రతీకారాలతోనే వీరిద్దరూ రగిలిపోయారు.. ఎత్తులు, పై ఎత్తులతో తమిళ రాజకీయాలను దేశంలో విభిన్నమైనవిగా మార్చివేశారు.. 

జయకు పరాభవం:
1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే అధికారంలోకి వచ్చింది.. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే సభ్యులు నువ్వేంత అంటే నువ్వేంత అన్నంతగా మాటల తూటాలు పేల్చుకున్నారు.  ఈ నేపథ్యంలో కరుణానిధిని క్రిమినల్ అని మాట తూలారు జయలలిత. దీంతో రెచ్చిపోయిన డీఎంకే సభ్యులు జయను చుట్టుముట్టారు.

మంత్రి ఒకరు జయలలిత జుట్టు పట్టి లాగారు. అంతటితో ఆగకుండా ఆమె చీరను లాగేందుకు ప్రయత్నించడంతో ఆమె నిండు సభలో కంటతడి పెట్టారు. మళ్లీ సభలో అడుగుపెడితే ముఖ్యమంత్రిగానే పాదం మోపుతానని శపథం చేశారు. అన్నట్లుగానే 1991లో జయ ముఖ్యమంత్రి అయ్యారు. 

వీల్‌ఛైర్‌పై ఉండగానే... అర్థరాత్రి కట్టుబట్టలతో కరుణ అరెస్ట్:
నాడు అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా కరుణను అర్థరాత్రిపూట కట్టుబట్టలతో అరెస్ట్ చేయించారు జయలలిత. తగిన సమయం కోసం ఎదురు చూస్తోన్న అమ్మ.. 12 కోట్ల ఫ్లై ఓవర్ కుంభకోణంలో కరుణానిధి ప్రమేయం ఉందంటూ అర్థరాత్రి పోలీసులను ఆయన ఇంటిపైకి పంపారు.

వయోభారంతో కదల్లేని స్థితిలో ఉన్న కరుణానిధిని వీల్‌ఛైర్‌లోంచి లాగి.. పంచె ఊడిపోతున్నా లెక్క చేయకుండా పోలీసులు వ్యాన్ ఎక్కించడం నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలా 2001 జూన్ 30 కరుణానిధి జీవితంలో చీకటి రాత్రిగా నిలిచిపోయింది.
 

loader