100 ఎకరాలతో పొలిటికల్ ఎంట్రీ ... ఇప్పుడు ఎకరం కూడా మిగల్లేదు : ఎస్ఎం కృష్ణ భార్య ప్రేమ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ 92 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ నిన్న(మంగళవారం) మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఆయన భార్య ప్రేమ మాటల్లో...
SM Krishna : సోమనహళ్లి మల్లయ్య కృష్ణ (ఎస్ఎం కృష్ణ)... ఒకప్పుడు భారత రాజకీయాల్లో గట్టిగా వినిపించిన పేరిది. దేశ రాజకీయాల్లో ఉత్తరాది నాయకుల హవా కొనసాగే సమయంలో ఓ దక్షిణాది నాయకులు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇలా ఎస్ఎం కృష్ణ అందరు నాయకుల్లా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేంద్ర మంత్రిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా... పదవి ఏదయినా నిబద్దతతో పనిచేసారు... ఇలా పదవులు ఆయనకు కాదు ఆయనే పదవులకు వన్నె తెచ్చారు.
ఆయన ఎంతటి నిజాయితీపరుడో ఆయన భార్య ప్రేమకృష్ణ చెప్పిన విషయాన్నిబట్టి అర్థమవుతుంది. తమ పెళ్లి సమయంలో భర్తకు 100 ఎకరాలు వుండేదని చెప్పారు... కానీ ఇప్పుడు ఆయన పేరుమీద ఒక్క ఎకరం భూమి కూడా లేదని తెలిపారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు సంపాదించడం తెలీదని... అందుకనే ఉన్నదంతా ఖర్చుచేసారని అన్నారు. ప్రజాసేవలో తన ఆస్తులను అమ్ముకున్న గొప్ప నాయకుడు ఎస్ఎం కృష్ణ అని ప్రేమకృష్ణ తెలిపారు.
ఇలా ప్రజానాయకుడు ఎస్ఎం కృష్ణ గురించి ఆసక్తికర విషయాలను ఆయన భార్య ప్రేమ కృష్ణ వివరించారు. ఎస్ఎం కృష్ణ జీవితం గురించి రాసిన 'కృష్ణపథం' పుస్తకంలో ప్రేమకృష్ణ ఎవరికీ తెలియని అనేక విషయాలను తెలిపారు. ఇలా ఎస్ఎం కృష్ణ మరణం నేపథ్యంలో ఆయన జీవించినంతకాలం ఎంత గొప్ప భావాలను కలిగివున్నారో తెలుసుకుందాం.
ఎస్ఎం కృష్ణ సొంతింటి స్టోరీ :
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి నిజలింగప్ప హయాంలో తమకు ప్రభుత్వం బెంగళూరులో కొంత ఇంటి స్థలాన్ని కేటాయించారని ఎస్ఎం కృష్ణ భార్య ప్రేమ తెలిపారు. సదాశివనగర్ లో ఇప్పుడున్న ఇల్లు అదేనని తెలిపారు. ఈ ప్లాట్ ను బెంగళూరు ట్రస్టు బోర్డు మంజూరు చేసిందని తెలిపారు. అందులో బ్యాంకు నుండి అప్పుతెచ్చి సొంతిల్లు కట్టుకున్నామని ప్రేమకృష్ణ తెలిపారు.
అయితే బ్యాంకు రుణం చెల్లించేందుకు ఎక్కువ రెంట్ వస్తుందని ఈ ఇంటిని వేరేవారికి అద్దెకు ఇచ్చామని తెలిపారు. తాము తక్కువ అద్దెకు ఆనాటి ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర ఇంట్లో వుండేవారమని ప్రేమకృష్ణ తెలిపారు. అయితే సతీష్ చంద్ర డిల్లీ నుండి బెంగళూరుకు రావడంతో తాము ఇల్లు మారాల్సి వచ్చిందని... ఆ సమయంలో ఎక్కడా ఇల్లు దొరకలేదని అన్నారు. చివరకు ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరు క్లబ్ లో వుండాల్సి వచ్చిందన్నారు.ఇలా ఓ మాజీ సీఎం కుటుంబంతో సహా ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారో ప్రేమకృష్ణ వెల్లడించారు.
తిరుపతి వెంకన్న దయతోనే కేంద్రమంత్రి :
1983 లో ఎస్ఎం కృష్ణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లారు. అక్కడ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇలా స్వామివారికి మొక్కు తీర్చుకున్న కొన్నాళ్లకే ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కిందని ప్రేమకృష్ణ వివరించారు.
ఎస్ఎం కృష్ణ హైదరాబాద్ లో వుండగా డిల్లీలోని ప్రధాని కార్యాలయం నుండి ఫోన్ వచ్చిందని... ఓసారి రావాలని అన్నారట. దీంతో వెంటనే ఆయన డిల్లీకి వెళ్లగా ప్రధాని ఇందిరాగాంధీ తన కేబినెట్ లో చేర్చుకుంటున్నారట. ఇలా కేంద్ర మంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేసారు...మొదటిసారి ఆయనకు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఇలా ఆ వెంకటేశ్వర స్వామి దయతోనే తన భర్తకు కేంద్ర మంత్రి పదవి దక్కిందని ప్రేమకృష్ణ చెప్పుకొచ్చారు.
పెళ్లికి ముందే ఇంటర్వ్యూ చేశాడు!
షిమోగా జిల్లా తీర్థహళ్లి తాలూకా కుడుమల్లి గ్రామానికి చెందిన ఎస్‌ఎం కృష్ణ ముందునుండే ఆదర్శభావాలు కలిగిన వ్యక్తి... అందువల్లే ఆయన మహిళల పరిస్థితిని అర్థం చేసుకుని పెళ్ళిచూపుల సమయంలో చాలా హుందాగా వ్యవహరించారని ప్రేమకృష్ణ తెలిపారు. తమ పెళ్లిచూపుల సన్నివేశాన్ని కృష్ణపథం పుస్తకం కోసం మరోసారి గుర్తుచేసుకున్నారు.
ఆ రోజుల్లో పెళ్లిచూపులంటే అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చూసుకోవడం. అయితే కొన్నిసార్లు అమ్మాయి ఇష్టాయిష్టాలను పట్టించుకునేవారు కాదు... కేవలం అబ్బాయికి నచ్చితే చాలు. కానీ ఎస్ఎం కృష్ణ మాత్రం అలా చేయలేదు... పెళ్లిచూపుల సమయంలోనే తనతో మాట్లాడారని అన్నారు. తనకు ఇష్టం వుందని చెప్పాకే పెళ్ళికి సిద్దమయ్యారని తెలిపారు. ఇలా ఆయన చాలా గొప్పగా ఆలోచించారని ప్రేమకృష్ణ తెలిపారు.
ఈ పెళ్లిచూపుల్లోనే తనను ఎస్ఎం కృష్ణ ఇంటర్వ్యూ చేసారని ప్రేమకృష్ణ తెలిపారు. మీరు ఏం చదువుకున్నారు? అసలు నేను ఎమ్మెల్యేను అనే విషయం తెలుసా? అంటూ పలు ప్రశ్నలు అడిగాడట. అందుకు ప్రేమ కూడా ధైర్యంగా తన చదువు గురించి చెప్పడమే కాదు ఆయన ప్రసంగాలను ఇష్టపడతానని చెప్పిందట. తాను ప్రతిపక్షంలో ఉన్నాను, పోరాటమే తన ప్రధాన లక్ష్యమని ఎస్ఎం కృష్ణ తనతో చెప్పారని ప్రేమ వెల్లడించారు.
''నువ్వు కోరుకున్నంత హాయిగా తనతో జీవితం వుండదు... ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా వుంటాను కాబట్టి ఒక్కోసారి నిన్న,కుటుంబాన్ని పట్టించుకోకపోవచ్చు. ఒక్కోసారి జైలుకు కూడా వెళ్లొచ్చు. నువ్వు ఇవన్నీ ఆలోచించాక ఇష్టమయితేనే పెళ్లికి సిద్దంగా వుండు'' అని ఎస్ఎం కృష్ణ పెళ్లిచూపుల సమయంలోనే చెప్పారని ప్రేమ తెలిపారు. అయితే అప్పటికే ఆయనపై మనసు పారేసుకున్న నేను అన్నింటికి ఓకే చెప్పి పెళ్లి చేసుకున్నానని ప్రేమకృష్ణ వెల్లడించారు.