భారత్‌లో ఇప్పటి వరకు కరోనా కేసులు, మరణాలు ఎక్కువున్న రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర అని ఎవరైనా చెబుతారు. అయితే మహారాష్ట్రను తోసిరాజని కర్ణాటక ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్‌ను దక్కించుకుంది. దేశవ్యాప్తంగా తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో అత్యధిక కేసులు ఈ రాష్ట్రంలోనే వెలుగుచూశాయి.

దీంతో ఇప్పటి వరకు కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్రను కర్ణాటక దాటేసింది. సోమవారం ఒక్కరోజే అక్కడ దాదాపు 40వేల మంది వైరస్‌ బారినపడ్డారు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.29 లక్షల కొత్త కేసులు బయటపడగా.. అత్యధికంగా కర్ణాటకలో 39,305 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక 37,236 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది.

తాజా కేసులతో కర్ణాటకలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19.73 లక్షలకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 596 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారంటే పరిస్ధితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఒకరోజులో ఇంత ఎక్కువ మంది మరణించడం కర్ణాటకలో ఇదే తొలిసారి. అంతేకాకుండా, మహారాష్ట్ర తర్వాత 500లకు పైగా రోజువారీ మరణాలు నమోదైన రెండో రాష్ట్రం కూడా ఇదే.   

Also Read:ఇండియాలో కరోనా జోరు: 24 గంటల్లో 3876 మంది మృతి

రాజధాని బెంగళూరు నగరంలోనే నిన్న 16,747 కేసులు నమోదవ్వగా.. 374 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,67,6409 యాక్టీవ్ కేసులున్నాయి. వైరస్‌ తీవ్రత నేపధ్యంలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. 15 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.

ప్రజలంతా లాక్‌డౌన్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించి సహకరించాలని సీఎం యడియూరప్ప కోరారు. మరోవైపు మహారాష్ట్రలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సోమవారం కొత్తగా 37,236 కేసులు రాగా.. ఈ స్థాయిలో కేసులు పడిపోవడం గడిచిన 40 రోజుల తర్వాత ఇదే తొలిసారి.