Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరు విమానాశ్రయంలో ముగ్గురు అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్‌.. జీనోమ్ సీక్వెన్సింగ్ కు శాంపిళ్లు

Bangalore: కొత్త సంవత్సరం వేడుక‌లు, అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల్లో ప‌లువురికి క‌రోనా పాజిటివ్ గా గుర్తించిన నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన క‌ర్నాట‌క ప్ర‌భుత్వం.. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. బ‌హిరంగ ప్రాంతాల్లో మాస్కులు ధ‌రించ‌డంతో పాటు కోవిడ్-19 మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించింది.

Karnataka :Three international passengers are Covid positive at Bengaluru airport; Samples for genome sequencing
Author
First Published Dec 29, 2022, 11:51 AM IST

Coronavirus Updates: ప‌లు దేశాల్లో ప్ర‌స్తుతం క‌రోనావైర‌స్ కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో వైద్యారోగ్యం రంగం తీవ్ర ఒత్తిడిలోకి జారుకుంటోంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, ఆయా దేశాల్లో ప్ర‌స్తుతం కోవిడ్-19 విజృంభ‌ణ‌కు కార‌ణ‌మైన ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ బీఎఫ్.7 స‌హా ఇత‌ర వేరియంట్లు భార‌త్ లోనూ గుర్తించ‌డంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. రాష్ట్రాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రించిన క్ర‌మంలో క‌ర్నాట‌క ప్ర‌భుత్వం సైతం అప్ర‌మ‌త్త‌మై కోవిడ్-19 నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటోంది. 

బెంగ‌ళూరు విమానాశ్ర‌యంలో అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల్లో ముగ్గురికి పాజిటివ్.. 

క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో విమానాశ్ర‌యాల్లో నిఘా పెంచిన క‌ర్నాట‌క ప్ర‌భుత్వం విదేశాల నుంచి వ‌చ్చే వారికి క‌రోనా ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి చేసింది. ఈ క్ర‌మంలోనే క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, బెంగ‌ళూరు విమానాశ్ర‌యంలో ముగ్గురు అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్టు గుర్తించారు.ఆ ముగ్గురు బుధ‌వారం రాత్రి అబుదాబి, హాంకాంగ్, దుబాయ్ నుండి తిరిగి వచ్చార‌ని అధికారులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే  వారందరినీ బెంగళూరులోని బౌరింగ్‌ ఆస్పత్రికి తరలించారు. అలాగే, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ పరీక్ష కోసం పంపారు. 


మాస్కులు త‌ప్ప‌నిస‌రి.. 

క‌రోనా వ్యాప్తిని నిరోధించ‌డానికి క‌ర్నాట‌క ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. ఈ క్ర‌మంలోనే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. బ‌హిరంగ ప్రాంతాల్లో మాస్కులు ధ‌రించ‌డంతో పాటు కోవిడ్-19 మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించింది. పాఠశాలలు, కళాశాలలతో పాటు, రాష్ట్రంలోని రెస్టారెంట్లు, పబ్బులు, విమానాశ్రయం వంటి ప్రదేశాలలో కూడా మాస్క్‌లు, ఇతర కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి చేయబడ్డాయి. కలబురగి విమానాశ్రయం ఇప్పటికే ప్రయాణికులకు మాస్క్‌ని తప్పనిసరి చేసింది. కలబురగి ఎయిర్‌పోర్ట్‌లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేశామనీ, మాస్క్ లేని వారిని ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలోకి అనుమతించబోమని కలబురగి ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ చిలక మహేష్ తెలిపారు.

కోవిడ్-19 సన్నద్ధతపై కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి కే.సుధాకర్‌, రెవెన్యూ మంత్రి, రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వైస్‌ చైర్మన్‌ ఆర్‌ అశోక అధ్యక్షత వహించారు. రెవెన్యూ మంత్రి ఆర్ అశోక మాట్లాడుతూ, "చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికులను పర్యవేక్షించాలని మా అడ్వైజరీ సెల్ సూచించింది. ఆరోగ్య మంత్రి కే. సుధాకర్‌తో కలిసి మేము కోవిడ్ సంసిద్ధతకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహించాము. కోవిడ్-19 ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తుల‌కు చికిత్స అందించడానికి బెంగళూరులో రెండు ఆసుపత్రులు సిద్ధం చేశాము" అని తెలిపారు. అలాగే, సినిమా థియేటర్లలో N95 మాస్క్‌లను తప్పనిసరి చేశామనీ, మాస్క్‌లు, శానిటైజర్లు మొదలైన వాటితో సహా కోవిడ్-19 ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండేలా ప్రజలను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.

రాత్రి ఒంటిగంట వ‌ర‌కే న్యూఇయ‌ర్ వేడుక‌లు

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో తెల్లవారుజామున 1 గంట తర్వాత నూతన సంవత్సర వేడుకలను నిషేధించింది. ఇన్ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో దీనిని స్ప‌ష్టం చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా (31 డిసెంబర్ 2022), న్యూ ఇయర్ (1 జనవరి 2023) కు సంబంధించిన అన్ని వేడుకలు వరుసగా 1 జనవరి 2023, జనవరి 2న ఉదయం 1 గంటలకు పూర్తి చేయాలని పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios