కర్ణాటక రాజకీయాలు మరోసారి చర్చకు దారి తీసాయి. ఆ రాష్ట్ర  మంత్రి  ఒకరు  ఎంపీలకు ఖరీదైన ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఎంపీలకు ఇలా గిఫ్ట్స్ ఇవ్వడం సిగ్గుచేటని బీజేపీ నేతలు దుయ్యపట్టారు.  అయితే ఈ విషయం తనకు తెలియదని ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పడం గమనార్హం. 

మంత్రి డీకే శివకుమార్ ఈ ఫోన్లను ఎంపీలకు ఇచ్చారు. పార్లమెంట్ సెషన్‌లో భాగంగా కర్ణాటక తరఫున లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకు సీఎం కుమారస్వామి ఢిల్లీలో 40 మంది రాష్ట్ర ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందే ఆ 40 మందికి ఖరీదైన ఐఫోన్లను అందజేశారు. 

దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తన ఎంపీలకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడానికి కుమారస్వామి దగ్గర డబ్బులున్నాయిగానీ.. రైతుల రుణాల మాఫీ చేయరు. విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వరు. కోస్తా, ఉత్తర కర్ణాటక అభివృద్ధిని నిధులు ఇవ్వరు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని కర్ణాటక బీజేపీ ట్వీట్ చేసింది.

తనకు ఇచ్చిన గిఫ్ట్‌ను తిరిగి ఇచ్చేస్తున్నట్లు బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్.. కుమారస్వామికి లేఖ రాసిన తర్వాత బీజేపీ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. సమావేశ వివరాలతోపాటు మీ ప్రభుత్వం ఓ ఖరీదైన ఐఫోన్‌ను కూడా పంపించింది. దీని ధర లక్షపైనే ఉంటుంది. ప్రజాధనాన్ని ఇలా ఖర్చు చేయడం సరికాదు అని ఆయన రాజీవ్ ఆ లేఖలో స్పష్టంచేశారు.