Karnataka: ముగ్గురు మంత్రులు, ప్రగతిశీల ఆలోచనాపరులకు చంపేస్తామని బెదిరింపు లేఖ
కర్ణాటకలో ముగ్గురు మంత్రులు, ప్రగతిశీల ఆలోచనాపరులు, నటులు ప్రకాశ్ రాజ్, చేతన్ అహింసతోపాటు ఓ మత గురువునూ త్వరలోనే చంపేస్తామని ఓ బెదిరింపు లేఖ కనిపించింది. మతోన్మాద ముస్లింలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడగలరా? అంటూ ఆ లేఖ ప్రశ్నించింది.

బెంగళూరు: కర్ణాటకలో ఈ మధ్య కాలంలో బెదిరింపు లేఖలు కలవరపెడుతున్నాయి. ప్రగతిశీల ఆలోచనాపరులు, అభ్యుదయ భావాలు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని ఈ లేఖలు వచ్చాయి. తాజగా, ఇలాంటి ఓ లేఖ వచ్చింది. ఇందులో ముగ్గురు మంత్రులను కూడా టార్గెట్ చేసి ఉంది. మరికొందరు చింతనాపరులు, నటుడు ప్రకాశ్ రాజ్, ఓ ఆధ్యాత్మిక గురువును కూడా చంపేస్తామని లేఖలో హెచ్చరించారు. మతోన్మాద ముస్లింలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడగలరా? అనే ప్రశ్న కూడా అందులో ఉన్నది.
ఈ లేఖలో పేర్కొన్న ముగ్గురు మంత్రులను గుర్తించారు. ఆరోగ్య మంత్రి దినేశ్ గుండు రావు, ఆర్డీపీఆర్, ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, పీడబ్ల్యూడీ మంత్రి సతీశ్ జార్కిహోలి ఉన్నారు. నిజగునానంద స్వామిజీ నడుపుతున్న నిష్కల మంటప ఆశ్రమంలో ఈ బెదిరింపు లేఖ లభించింది.
ఈ లేఖలో ప్రగతిశీల ఆలోచనపరులు ఎస్ జీ సిద్ధరామయ్య, కే మరులసిద్దప్ప, బారాగురు రామచంద్రప్ప, భాస్కర్ ప్రసాద్, ప్రొఫెస్ భగవన్, ప్రొఫెసర్ మహేశ్ చంద్ర గురు, బీటీ లలిత నాయక్, ద్వారకానాథ్, దేవనూరు మహదేవా, బీఎల్ వేణు, నటులు, కార్యకర్తలు ప్రకాశ్ రాజ్, చేతన్ అహింసల పేర్లనూ ప్రస్తావిస్తూ చావు బెదిరింపులు చేశారు.
సెప్టెంబర్ 20వ తేదీన బెలగావి జిల్లాలోని ఆశ్రమంలో ఈ లేఖ లభించింది. పైన పేర్కొన్నవారంతా మతోన్మాద ముస్లింలకు వ్యతిరేకంగా గళం విప్పగలరా? అని ప్రశ్నించింది. దేశ ద్రోహ కార్యకలాపాలు చేసే వారికి వ్యతిరేకంగా మాట్లాడగలరా? అంటూ అడిగింది. ఇక మత గురువు నిజగునానంద స్వామిజీకి ఈ లేఖ డెత్ వారెంట్ అని పేర్కొంది.
‘నీ సొంత కార్యక్రమంలో చావు నీ దగ్గరికి వస్తుంది. నేను పరిహాసమాడటం లేదు. మనిషి రూపంలోని రాక్షసుడవు నీవు. హిందూ దేవుళ్లను దూషించే రాక్షుడవు నీవు. నీ జీవిత చరమాంక దశలో ఉన్నావు. నిన్ను నిర్మూలించడం మినహా మరే మార్గం లేదు’ అని ఆ లేఖ పేర్కొంది.
15 మంది ప్రగతిశీల కన్నడ రచయితలు, ఆలోచనాపరులకు బెదిరింపు లేఖలు రాసిన హిందూ యాక్టివిస్ట్ శివాజీ రావ్ జాదవ్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు శనివారం తెలిపారు. అయితే.. తాజా లేఖ రాసింది కూడా ఆయనేనా? అనే విషయాన్ని పోలీసులు ఇంకా స్పష్టంగా చెప్పలేదు. గత కొన్ని రోజులుగా ఈ నిందితుడు పలువురిని బెదిరిస్తూ లేఖలు రాశాడు. సీఎం సిద్ధరామయ్యను కూడా ఆశ్రయించి తమ పరిస్థితులను బాధితులు తెలిపారు.