కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతటి హైడ్రామా నడిచిందో చెప్పక్కర్లేదు.. ఆ తర్వాత మంత్రివర్గ కూర్పు కోసం అంతకు మించిన రాజకీయం నడిచింది. ప్రాధాన్యత గల శాఖలు కావాలని ఇరు పార్టీల్లోని నేతలు అధిష్టానాల మీద ఒత్తిడి తేవడంతో ఎంతకూ వివాదం సద్దుమణగలేదు అంతా ఒకే అనుకుంటున్న సమయంలో మంత్రుల కార్ల వల్ల తిరిగి కుమారస్వామి తలబొప్పి కడుతోంది.  

కర్ణాటక మంత్రివర్గంలో ఆహార, పౌర సరఫరాల మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ తనకు పెద్దకారే కావాలని పట్టుపడుతున్నారు.. చిన్న కారులో వెళితే తాను ఎవరికీ కనిపించనని.. మంత్రిని కాబట్టి తనకు లగ్జరీ కారే కావాలని జమీర్ డిమాండ్ చేస్తున్నారు.. ముఖ్యమంత్రి కూడా సొంతకారును ఉపయోగిస్తున్నారని గుర్తు చేయగా.. సీఎం కాబట్టి ఆయనకు మంచి పాపులారిటీ ఉంటుంది.. కాబట్టి ఏ కారులో వెళ్లినా ముఖ్యమంత్రిని సులభంగా గుర్తిస్తారు. నేనింకా అంత స్థాయికి ఎదగలేదు..ప్రభుత్వ కారులో వెళ్తేనే నాకు గౌరవం దక్కుతుందని చెప్పి.. అందుకు మాజీ సీఎం సిద్ధరామయ్య వాడిన కారు కావాలని కోరుతున్నారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పొదుపుకు బాగా ప్రాధాన్యత ఇస్తున్న కుమారస్వామి మంత్రులు, అధికారులు కొత్త కార్లు కొనద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.. దీంతో గత ప్రభుత్వంలో వాడిన కార్లనే మంత్రులు ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న కార్లన్నీ టయోటా ఇన్నోవా క్రిస్టాస్ కార్లు కాగా... సిద్ధరామయ్య వాడిన రెండు టయోటా ఫార్చూనర్ కార్లలో ఒకటి తనకు కావాలని జమీర్ పట్టుబడుతుండటంతో అధికారులు తలలు పట్టుకున్నారు.. దీనిపై సీఎం నుంచి ఆదేశాలు వస్తే కానీ.. ఏం చేయాలేమని వారు చెబుతున్నారు.