కర్ణాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. కాంట్రాక్టర్ ఆత్మహత్య మంత్రి ఈశ్వరప్ప మెడకు చుట్టుకుంటున్నది. ఎన్నికలు సమీపించిన వేళ పార్టీ డ్యామేజీని కంట్రోల్ చేయడానికి ఆ మంత్రిని వొదలాగల్సిందిగా బీజేపీ కేంద్ర నాయకత్వం సీఎంకు తెలియజేసినట్లు సమాచారం. కానీ, తాను రాజీనామా చేసేదే లే అంటూ మంత్రి స్పష్టం చేశారు. తర్వాతి పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక రాజకీయాలు హీటెక్కాయి. కర్ణాటక పంచాయతీ రాజ్ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేస్తూ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. ఎన్నికల వేళ ఎక్కడ ఈ ఇష్యూ డ్యామేజీ చేస్తుందోనని బీజేపీ భయపడుతున్నది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి మంత్రి ఈశ్వరప్పతో రాజీనామా చేయించాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి.
కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప మాత్రం కేంద్ర నాయకత్వానికి భిన్న మార్గంలో వెళ్లుతున్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, తాను రాజీనామా చేసేదే లేదని స్పష్టం చేశారు. ఏ కారణం చేతనైనా సరే తాను రాజీనామా చేయనని తెలిపారు. కాంట్రాక్టర్ సంతోష్ ఆత్మహత్య వెనుక ఏదో కుట్ర ఉన్నదని ఆరోపించారు. సూసైడ్ నోట్, మరణానికి ముందే ఆయన మిత్రులు, కుటుంబ సభ్యులకు సందేశాలు పంపడాన్ని ప్రశ్నించారు.
త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం ఈ ఘటనతో ఆందోళన చెందుతున్నది. అందుకే మంత్రి పదవి నుంచి ఈశ్వరప్పను తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. అదీగాక, కేంద్ర నాయకత్వం నుంచి కూడా ఆయనను తొలగించాలని సీఎం బసవరాజు బొమ్మైకి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ఆ ఆదేశాలను అనుసరించే సీఎం బసవరాజు బొమ్మై మంత్రి ఈశ్వరప్పను మంత్రి పదవి నుంచి వైదొలగాల్సిందిగా కోరినట్టు తెలిసింది. కానీ, తాజాగా, మంత్రి ఈ
వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బీజేపీ జాతీయ జనరల్ సెక్రెటరీ సీటీ రవి కూడా మంత్రి ఈశ్వరప్పను తొలగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నట్టుగా మార్చారు. ఇలాంటి ఘటనలు ఎదురువచ్చినప్పుడు ప్రతిపక్షాలు తప్పకుండా రాజీనామా డిమాండ్ చేస్తారని వివరించారు. ఒకవేళ బీజేపీ ప్రతిపక్షంలో ఉండే కూడా ఇదే డిమాండ్ ప్రముఖంగా వినిపించేదని పేర్కొన్నారు. ఈశ్వరప్ప చాలా సీనియర్ నేత, అనుభవజ్ఞుడైన నేత అని వివరించారు. చెడ్డ పేరు రాకుండా కాపాడుకోవాలంటే కొన్ని సార్లు జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి
ఉంటుందని అన్నారు.
సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టరు నుంచి 40 శాతం కమీషన్‌ను మంత్రి డిమాండ్ చేశాడని, మంత్రి ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపించాయి.
కాగా, ఈ ఘటనను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోవడంపై దృష్టి పెట్టాయి. తీర ప్రాంతంలో బలమైన పార్టీగా ఉన్న ఎస్‌డీపీఐ ఏకంగా సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుని రచ్చ చేశాయి. కాంగ్రెస్ ఏకంగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి నివాసం ముందు ప్రదర్శనకు దిగాయి. వెంటనే సదరు మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి.
