మైనర్ బాలికను ప్రేమ పేరిట మాయ చేశాడు. అతని మాయ మాటలు నిజమని ఆ బాలిక నమ్మేసింది... కొంతకాలంగా వీరి వ్యవహారం సజావుగానే సాగుతోంది. సడెన్ గా అతనికి బాలికపై అనుమానం పుట్టుకువచ్చింది. ఈ అనుమానం కాస్త పెనుభూతమై కూర్చుంది. ఎలాగైనా తన ప్రియురాలిని హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో.. తనది నిజమైన ప్రేమ అయితే... ఇది తాగు అంటూ పురుగుల మందు ఇచ్చాడు. నిజం తెలీని ఆ బాలిక దానిని తాగి చనిపోయింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం తాలుకా తొండేబావి హోబళీ కమలాపురం గ్రామానికి చెందిన వెంకటేష్(21) అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన  ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. ప్రేమ పేరిట ఆమె వెంట పడ్డాడు.  అతని ప్రేమను ఆమె కూడా అంగీకరించింది. తనతో కాకుండా మరో వ్యక్తితో కూడా ప్రేమ వ్యవహారం నడుపుతుందేమోనని బాలికపై వెంకటేష్ కి అనుమానం కలిగింది.

Also Read మరదలితో అఫైర్: దోపిడీ ప్లాన్ వేసి భార్యను చంపేశాడు

ఈ క్రమంలో ఆమెను చంపేయాలని అనుకున్నాడు. ఈ నెల 6వ తేదీన తొండేబావి సమీపానికి పిలుచుకొని వెళ్లి.. నీ ప్రేమ నిజమైతే దీనిని తాగు అని చెప్పాడు. అది విషమని తెలిక బాలిక తాగేసింది. కాసేపటి తర్వాత ఇద్దరూ ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు. ఇంటికి వెళ్లిన బాలిక కడుపులో నొప్పిగా ఉందని ఏడవడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

అయితే... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.   దీంతో ప్రియుడు వెంకటేశ్‌ తనను పోలీసులు పట్టుకుపోతారని భావించి తన నోటికి ఎలుకల మందును పూసుకొని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు నటించాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు వెంకటేశ్‌ ఏమీ తాగలేదని చెప్పడంతో పోలీసులు విచారించి బాలికకు మందు తాగించింది ఇతడేనని నిర్ధారించి కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.