కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం శక్తి పథకం కింద అందిస్తున్నది. అయితే, ఓ పురుషుడు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. అందుకోసం మహిళ అవతారం ఎత్తాడు. బుర్ఖా ధరించి బస్సుల్లో ప్రయాణించాడు. ఓ బస్టాండ్‌లో దొరికేశాడు.
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీని అమలు చేస్తూ మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత రవాణాకు అవకాశం కల్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఇప్పుడు మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. శక్తి పథకం కింద ఈ సదుపాయాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు హర్షిస్తున్నారు. అయితే, పురుషులకూ ఈ అవకాశం లేదు. వారు తప్పకుండా టికెట్ తీసుకుని ప్రయాణించాల్సిందే.
కానీ, ఈ శక్తి పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కొన్ని విచిత్రమైన ఘటనల ముందుకు వచ్చాయి. ఇటీవలే కొందరు ఆటో డ్రైవర్లు భోరుమన్న సంగతి తెలిసిందే. తమకు గిరాకీ ఉండటం లేదని, శక్తి పథకం తమ ఉపాధిని దెబ్బతీస్తున్నదని అన్నారు. ఇప్పుడు మరో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆడవారికి మాత్రమే ఈ సదుపాయం ఉన్నందున కొందరు పురుషులు ఆడవేషం వేస్తున్నారు.
ధార్వాడ జిల్లాలో కుండగోల్ తాలూకాలోని సంశి బస్ స్టాండ్‌లో ఈ వ్యవహారం బయట పడింది. ఆ బస్ స్టాండ్‌లో ఓ వ్యక్తి బుర్ఖా ధరించి బస్సు కోసం వేచి నిలబడ్డాడు. అయితే, ఆయన నడవడిక స్థానికుల్లో అనుమానాలు రేపింది. కొందరు గుమిగూడి ఆ బుర్ఖా తొలగించాల్సిందిగా బలవంతపెట్టారు. దీంతో గత్యంతరం లేక బుర్ఖా తొలగించిగా అసలు గుట్టు బయటపడింది.
Also Read: బీజేపీ మినీ జమిలి వ్యూహం.. తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలతో అందుకే సన్నిహితం?
ఆ వ్యక్తి సిందగి తాలూక విజయపురాకు చెందిన వీరభద్రయ్య నింగయ్య మాథపటి అని తేలింది. అతను యాచించడానికి అక్కడికి వచ్చాడు. అతని వివరాలను పోలీసులు దర్యాప్తు చేయగా ఈ విషయం తెలిసింది. కాళ్లకు స్లిప్పర్లు వేసుకుని బుర్ఖా ధరించిన ఆయన దగ్గర ఒక మహిళ ఆధార్ కార్డు కూడా ఉండటం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
శక్తి స్కీం కింద ఆ పట్టణంలో ఉచితంగా బస్సుల్లో తిరగడానికే వీరభద్రయ్య బుర్ఖా ధరించినట్టు తెలుస్తున్నది. అతను బెంగళూరు నుంచి సంశికి బుర్ఖా ధరించే వచ్చినట్టు తెలిసింది. అక్రమంగా బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేశారు.
