బెంగళూరు: కర్ణాటకలో లేడీ సింగంగా పేర్గాంచిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిపై బదిలీ వేటు పడింది. కర్ణాటక భవన నిర్మాణ సంక్షేమ శాఖ నుంచి ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

కర్నాటక భవన నిర్మాణ సంక్షేమ శాఖ నుంచి ఆమెను మరో శాఖకు బదిలీ చేస్తూ యడియూరప్ప ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోహిణీ సింధూరిపై బదిలీ వేటు పడటం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం. 

రోహిణి సింధూరిపై బదిలీవేటుకు ముఖ్యమంత్రి ఆగ్రహమే కారణమని సమాచారం. కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన వరదల నేపథ్యంలో రూ.1000 కోట్ల భవన నిర్మాణ సంక్షేమ శాఖ నిధులను విపత్తు సహాయ నిధికి మళ్లించాలని కర్ణాటక సీఎం యడియూరప్ప కోరారు. 

అందుకు రోహిణీ సింధూరి ససేమిరా అనడంతో యడియూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆమెపై బదిలీవేటు పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను పట్టు పరిశ్రమ శాఖకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే రోహిణి సింధూరి కర్ణాటక ఐఏఎస్ అధికారుల్లో ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గని నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారిణిగా ఆమెకు పేరు. అందువల్లే ఆమెను లేడీ సింగం అని పిలుస్తారు. 

యడియూరప్ప ప్రభుత్వం సెప్టెంబర్ 20న ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.సెప్టెంబర్ 24న ఆమెను పట్టు పరిశ్రమ శాఖకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపోతే రోహిణి సింధూరి తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం విశేషం.

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ టీంలోకి ఫైర్ బ్రాండ్ కలెక్టర్ : త్వరలో ఏపీకి తెలుగు ఐఏఎస్ రోహిణి సింధూరి